Alcohol Affects: చాలామంది మానసిక ఉల్లాసం, ఆనందం కోసం మద్యం సేవిస్తుంటారు. ఆల్కహాల్‌ను మితంగా తీసుకున్నప్పుడు మెదడులో డోపమైన్, ఎండార్ఫిన్ వంటి హార్మోన్లు విడుదలై తాత్కాలికంగా హుషారు, ఆనందం కలుగుతుంది. అయితే తినేదైనా, తాగేదైనా పరిమితి మించితే సమస్యలు తప్పవు. ఆల్కహాల్ విషయంలో ఈ జాగ్రత్త మరింత అవసరం. ఎందుకంటే అతిగా మద్యం తీసుకుంటే మెదడులో క్రియాశీలత తగ్గిపోతుంది. నాడులు దెబ్బతింటాయి, గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది, శ్వాస కూడా నెమ్మదిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా కూడా మారుతుంది.
READ MORE: Increase Vehicle Prices: వాహన ధరలు పెంచనున్న జేఎస్‌డబ్ల్యూ ఎంజీ ..జనవరి ఫస్ట్ నుంచి అమల్లోకి
మద్యం తాగిన వెంటనే దాని ప్రభావం మొదలవుతుంది. తాగడం మొదలుపెట్టిన కేవలం 6 నిమిషాల్లోనే ఆల్కహాల్ మెదడు కణాల్లోకి చేరుతుంది. ఆ సమయంలో డోపమైన్ విడుదలై ఆనందం, ఆహ్లాదం, హాయిగా తేలిపోతున్న అనుభూతులు కలుగుతాయి. దీనికి గామా అమైనో బ్యుటిరిక్ యాసిడ్ (గాబా) అనే న్యూరోట్రాన్స్‌మిటర్ ప్రధాన కారణం. గాబా మెదడులోని సిగ్నల్స్‌ను నెమ్మదింపజేసి విచక్షణను తగ్గిస్తుంది. దీంతో ధైర్యం వచ్చినట్లు అనిపించి, సాధారణంగా ప్రమాదకరమని భావించే పనులను కూడా తేలికగా చేస్తారు. ఇదే మద్యం యొక్క ప్రధాన సైడ్ ఎఫెక్ట్.
READ MORE: Mega Star : వింటేజ్ లుక్ లో మెగాస్టార్.. ఫొటోస్ వైరల్
ఆల్కహాల్ శరీరంలోకి ఇతర పదార్థాల కంటే వేగంగా చేరుతుంది. మద్యంలో కొంత భాగం నేరుగా జీర్ణాశయం నుంచే రక్తంలో కలుస్తుంది. ఆ రక్తం ద్వారా మెదడు, కాలేయం సహా అన్ని అవయవాలకు చేరుతుంది. ఆ తర్వాత కాలేయం ఆల్కహాల్‌ను విచ్ఛిన్నం చేయడానికి ఎంజైములను విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియలో ఆల్కహాల్ మొదట ఎసిటాల్డిహైడ్‌గా, తర్వాత ఎసిటిక్ ఆమ్లంగా, చివరికి కార్బన్ డయాక్సైడ్‌గా మారుతుంది. ఈ దశల్లో కొంత శక్తి విడుదల అవుతుంది. అందుకే బాగా మద్యం తాగేవారిలో కెలొరీలు ఎక్కువగా చేరి బరువు పెరుగుతారు. అయితే ఈ కెలొరీలతో పాటు అవసరమైన పోషకాలు అందవు. ఫలితంగా వారు నీరసంగా, అనారోగ్యంగా కనిపిస్తారు. మద్యం మోతాదు పెరిగే కొద్దీ దుష్ప్రభావాలు కూడా పెరుగుతాయి. మద్యం ప్రభావం మెదడుతోనే ఆగిపోదు. కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎసిటాల్డిహైడ్ వల్ల కాలేయం దెబ్బతిని హెపటైటిస్, కాలేయ క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, మద్యం తాగేవారి పిల్లలకు అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
READ MORE: JanaNayagan : రికార్డుల వేట మొదలు పెట్టిన జననాయగన్.. 24 గంటల్లో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్
చాలామంది రాత్రి నిద్ర పట్టడానికి మద్యం తాగుతారు. కానీ ఇది పూర్తి నిద్రకు భంగం కలిగిస్తుంది. ఆల్కహాల్ తాగితే త్వరగా నిద్ర పట్టినా, నిద్ర నాణ్యత తగ్గిపోతుంది. సాధారణంగా నిద్రలో 5 నుంచి 7 ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ సైకిల్స్ ఉంటాయి. కానీ మద్యం తాగి నిద్రించే వారిలో 1 లేదా 2 స్లీప్ సైకిల్స్ తగ్గిపోతాయి. దీంతో మరుసటి రోజు అలసట, నీరసం ఎక్కువగా ఉంటుంది. మద్యం వల్ల కండరాలు రిలాక్స్ కావడంతో గురక పెరుగుతుంది. కొంతమంది నిద్రలో మాట్లాడటం, నడవడం కూడా చేస్తారు. దీని వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఆల్కహాల్ హృదయ స్పందన రేటును పెంచి రక్తపోటును కూడా పెంచుతుంది. కిడ్నీలపై నేరుగా ప్రభావం చూపుతుంది. మద్యం తాగినప్పుడు మూత్రం ఎక్కువగా రావడం వల్ల శరీరంలో నీటి లోపం ఏర్పడుతుంది. వాసోప్రెసిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వల్ల డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. మొత్తంగా చూస్తే సరదాగా మొదలయ్యే మద్యపానం క్రమంగా ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, జీవితాన్ని దెబ్బతీసే వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. అందుకే మొదట్లోనే మద్యం అలవాటును నియంత్రించడం లేదా పూర్తిగా వదిలేయడం ఎంతో అవసరం.
