Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Curry Leaves Pickle Recipe: వంటల్లో సువాసన కోసం వేసి, తినేటప్పుడు పక్కన పెట్టే కరివేపాకుతో అద్భుతమైన నిల్వ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకుతో ఈ విధంగా పచ్చడి చేసుకుంటే, వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటుంటే ఆ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇంట్లో పప్పు, కూరలు ఉన్నా సరే వాటిని పక్కన పెట్టి మరీ ఈ పచ్చడితోనే భోజనం మొత్తం పూర్తి చేస్తారు. అంతటి కమ్మని కరివేపాకు నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
* ముదురు కరివేపాకు: 4 కప్పులు (శుభ్రం చేసి, తడి లేకుండా ఆరబెట్టినది)
* పల్లీ నూనె (వేరుశనగ నూనె): 1 కప్పు (కరివేపాకు కొలుచుకున్న కప్పుతోనే)
* మెంతులు: 1 టేబుల్ స్పూన్
* ధనియాలు: 2 టేబుల్ స్పూన్లు
* శనగపప్పు: 1 టేబుల్ స్పూన్
* మినప్పప్పు: 1 టేబుల్ స్పూన్
* ఆవాలు: 1 టీస్పూన్
* జీలకర్ర: 1 టీస్పూన్
* ఎండుమిరపకాయలు: 15 – 20 (కారానికి తగినట్లుగా).
Also Read
- Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
- Chanakya Niti: ఈ 5 రకాల మనుషులతో జాగ్రత్త.. చాణక్య నీతి హెచ్చరిక..
- Healthy Winter Breakfast: చలికాలంలో ఆరోగ్యకరమైన అల్పాహారం.. వేడివేడిగా సజ్జల వెజిటబుల్ ఉప్మా!.. 5 నిమిషాల్లో రెడీ..!
- Home Decor Ideas: పాత ప్లాస్టిక్ కుర్చీలను పనికిరావని పడేస్తున్నారా? ఇలా చేస్తే అస్సలు పడేయరు!
తయారీ విధానం
కరివేపాకు ఎంపిక
నిల్వ పచ్చడి కోసం ఎప్పుడూ లేత కరివేపాకును కాకుండా.. ఆకు కొంచెం పెద్దగా, మందంగా, ముదురుగా ఉన్నదానిని ఎంచుకోవాలి. ముందుగా కరివేపాకును ఒక గిన్నెడు నీటిలో వేసి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆకులకు ఉన్న మట్టి, ఇసుక వంటివి అడుగుకు చేరి ఆకు శుభ్రపడుతుంది. 15 నిమిషాల తర్వాత నీటిని కదపకుండా పైనుంచి ఆకులను మాత్రమే తీసుకుని ఒక జల్లెడలో వేసి 10 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు నీరు పోయిన తర్వాత, ఆకులను ఎండలో కాకుండా ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద ఒక కాటన్ వస్త్రం లేదా దుప్పటిపై ఆరబెట్టాలి. ఆకు పూర్తిగా ఎండిపోవాల్సిన అవసరం లేదు కానీ, తడి ఏమాత్రం లేకుండా పొడిగా అయ్యే వరకు ఆరబెట్టుకుంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
కొలతల వివరాలు
పచ్చడి రుచిగా రావడానికి సరైన కొలతలు చాలా ముఖ్యం. దీని కోసం ఏదైనా ఒక గిన్నె లేదా కప్పును కొలతగా తీసుకోవాలి. ఆరబెట్టుకున్న కరివేపాకును ఆ గిన్నెతో కొలుచుకోవాలి. ఇక్కడ నాలుగు కప్పుల కరివేపాకుకు సరిపడా కొలతలను ఉపయోగిస్తున్నాము. ఆకులను కొలుచుకునేటప్పుడే ఏవైనా పాడైన లేదా నల్లబడిన ఆకులు ఉంటే తీసివేయాలి, లేదంటే పచ్చడి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.
దినుసులను వేయించుకోవడం
కరివేపాకును కొలుచుకున్న కప్పుతోనే ఒక కప్పు పల్లీ నూనెను కడాయిలో వేసి వేడి చేయాలి. నిల్వ పచ్చళ్లకు పల్లీ నూనె అయితేనే అసలైన రుచి వస్తుంది. నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటను పూర్తిగా తగ్గించి, అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి అర నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి సన్నని మంటపైనే దోరగా వేయించుకోవాలి. మంట ఎక్కువగా పెడితే దినుసులు మాడిపోయి పచ్చడి చేదు వస్తుంది కాబట్టి జాగ్రత్తగా వేయించాలి. ఇవి కాస్త రంగు మారిన తర్వాత ఒక టీస్పూన్ ఆవాలు, ఒక టీస్పూన్ జీలకర్ర వేసి మరో అర నిమిషం పాటు వేయించాలి. దినుసులన్నీ మంచి బంగారు రంగులోకి మారిన తర్వాత, నూనె రాకుండా వాటిని మాత్రమే ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. దినుసులు తీసేసిన తర్వాత కడాయిలో మిగిలిన నూనెలోనే సుమారు ఎండుమిరపకాయలను వేసుకోవాలి. వీటిని కూడా సన్నని మంటపైనే రంగు మారే వరకు దోరగా వేయించుకోవాలి. ఎండుమిర్చి చక్కగా వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి.
ఎండుమిరపకాయలు వేగిన తర్వాత, మనం సిద్ధం చేసుకున్న 4 కప్పుల కరివేపాకును ఆ నూనెలో వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మధ్యమధ్యలో కలుపుతూ కరివేపాకు క్రిస్పీగా మారే వరకు వేయించాలి. ఆకు బాగా వేగితేనే పచ్చడి నిల్వ ఉంటుంది. ఆకు క్రిస్పీగా మారిన తర్వాత, గింజలు, ఈనెలు తీసి శుభ్రం చేసిన పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును విడివిడిగా చేసి వేయాలి. అలాగే ఒక చిన్న వెల్లుల్లి గడ్డలోని రెబ్బలను తొక్క తీయకుండానే విడివిడిగా చేసి వేసి లో ఫ్లేమ్‌లో ఒక నిమిషం పాటు వేయించాలి. ఆకు చేతితో నలిపితే పొడి అయ్యేంత క్రిస్పీగా మారిన తర్వాత, రుచికి సరిపడా కల్లుప్పు (రాక్ సాల్ట్) వేసి మరో నిమిషం వేయించి, చిల్లుల గరిటెతో ఆకు మిశ్రమాన్ని నూనె నుండి బయటకు తీయాలి. కడాయిలో మిగిలిన నూనెను అలాగే ఉంచాలి.
పచ్చడిని గ్రైండ్ చేసుకోవడం
ముందుగా వేయించి చల్లార్చుకున్న శనగపప్పు, ధనియాల దినుసులను ఒక మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న కరివేపాకు, ఎండుమిర్చి మిశ్రమాన్ని ఒకేసారి కాకుండా సగం వేసి గ్రైండ్ చేయాలి. అది కొద్దిగా నలిగిన తర్వాత మిగిలిన సగం కరివేపాకును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. చివరగా మనం కడాయిలో పక్కన ఉంచుకున్న మిగిలిన నూనెను కూడా ఇందులో పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చడిలో నూనె శాతం సరిపడా ఉంటేనే అది ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఇప్పుడు మరో కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, 2 లేదా 3 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించాలి. తాలింపు వేగిన వెంటనే మనం గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పచ్చడిని ఇందులో వేసి లో ఫ్లేమ్‌లో 4 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉడికించాలి. ఆ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల తురిమిన బెల్లం వేయాలి. బెల్లం వేయడం వల్ల పచ్చడికి పులుపు, కారం, తీపి సమపాళ్లలో కలిసి అద్భుతమైన రుచి వస్తుంది. బెల్లం పూర్తిగా కరిగి పచ్చడిలో కలిసే వరకు మరో 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే మన కరివేపాకు పచ్చడి రెడీ.
తాజావార్తలు
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
January 12 Vidudala నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది.. డ్యాన్స్‌తో అదరగొట్టిన కీర్తి, కృతి!
-
CM Chandrababu: ఓటుకు నోటు వద్దు.. మంచి నాయకుడిని ఎన్నుకోండి.. ప్రజలకు చంద్రబాబు పిలుపు
-
Jaipur: ఇంట్లో చేసిన నూడుల్స్ తిని ఏడేళ్ల చిన్నారి మృతి.. అక్క పరిస్థితి విషమం..
-
KL Rahul: గ్లెన్ ఫిలిప్స్‌కు డ్రింక్స్ కొనిస్తా.. రివ్యూపై రాహుల్ ఫన్నీ కామెంట్స్!
ట్రెండింగ్
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!
-
అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!