India Post GDS : పదో తరగతితో పోస్ట్‌ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు

India Post

India Post

India Post GDS : పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు ఇండియా పోస్ట్ అద్భుతమైన అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో జులై 2026 సెషన్‌కు సంబంధించి 25,000 కంటే ఎక్కువ గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM) , డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ చేపడుతుండటం వల్ల, మంచి మార్కులు పొందిన అభ్యర్థులకు ఇది సువర్ణావకాశంగా నిలవనుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు పదో తరగతిలో మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో పాటు సంబంధిత పోస్టల్ సర్కిల్ స్థానిక భాషను చదివి ఉండటం తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోస్టల్ సర్కిళ్లకు అప్లై చేసే అభ్యర్థులు పదో తరగతి వరకు తెలుగు భాషను చదివి ఉండాలి. దీనితో పాటు ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు లభిస్తుంది.

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 2, 2026 నుండి సెప్టెంబర్ 21, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి బిపిఎమ్ (BPM) హోదాకు రూ.12,000 నుండి రూ.29,380 వరకు, ఎబిపిఎమ్ (ABPM) , డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 నుండి రూ.24,470 వరకు నెలవారీ వేతనం లభిస్తుంది. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉండగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు , మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. అయితే అభ్యర్థులు ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్‌కు మాత్రమే జాగ్రత్తగా దరఖాస్తు చేసుకోవాలని, ఒకటి కంటే ఎక్కువ సర్కిళ్లకు అప్లై చేస్తే దరఖాస్తులు రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.