Site icon NTV Telugu

Russia-Ukraine War: బెడిసికొట్టిన మస్క్ ప్రణాళిక.. జెలెన్‌స్కీ కౌంటర్

Elon Musk Vs Zelenskyy

Elon Musk Vs Zelenskyy

Zelency Counter Voting On Elon Musk Peace Plan Over Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్ ఇటీవల ఒక శాంతి ప్రణాళికను ప్రతిపాదించాడు. రష్యా విలీనం చేసుకున్న ప్రాంతాలపై ఓటింగ్, క్రిమియా నీటి సరఫరా విషయాలపై కొన్ని సూచనలు ఇచ్చాడు. ట్విటర్ వేదికగా అతడు ఈ ప్రతిపాదనల్ని చేశాడు. అయితే.. ఈ ప్లాన్ పూర్తిగా బెడిసికొట్టింది. ఉక్రెయిన్ అధ్యక్షుడితో పాటు పలువులు ఉన్నతాధికారులు అతడి ప్రతిపాదనని తిరస్కరించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యా.. ఇటీవల ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌, జపోరిజియా, లుహాన్స్క్‌, దొనెట్స్క్‌ ప్రాంతాలను విలీనం చేసుకుంది. ఈ విషయాన్ని గత శుక్రవారం ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే తాము ఆ నాలుగు ప్రాంతాల్ని తమ దేశంలో విలీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు కూడా చేశారు. అయితే.. ఈ విలీన ప్రక్రియను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ తీవ్రంగా ఖండించారు. ఇది ఐరాస లక్ష్యాలకు, మూల సిద్ధాంతాలకు విరుద్ధమని మండిపడ్డారు. దీనిని ఉద్దేశించే.. ఎలాన్ మస్క్ తన శాంతి ప్రణాళికలో భాగంగా కొన్ని ప్రతిపాదనల్ని ముందుంచాడు.

‘‘మొదటిది.. ఇటీవల రష్యా విలీనం చేసుకున్న ప్రాంతాల్లో ఐరాస పర్యవేక్షణలో ప్రత్యేక ఎన్నికలు నిర్వహించాలి. ఆ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఉక్రెయిన్‌కి అనుకూలంగా ఉంటే, రష్యా వెంటనే ఆ ప్రాంతాలను వీడేలా చర్యలు తీసుకోవాలి. రెండోది.. 1783 నుంచి క్రిమియా అధికారికంగా రష్యాలో భాగం. దానికి నీటి సరఫరా హామీ ఉండాలి. మూడోది.. ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలి’’. ఇవి.. మస్క్ ప్రతిపాదనలు. ఈ ప్రణాళికను ఆయన ఓటింగ్‌లో పెట్టారు. అయితే.. దీని మీద ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ ఘాటుగా బదులిచ్చారు. ‘మీకు ఉక్రెయిన్‌వైపు నిలిచే మస్క్ ఇష్టమా? లేక రష్యాకు మద్దతు ఇచ్చే వ్యక్తా..?’ అంటూ కౌంటర్ ఓటింగ్ నిర్వహించారు.

ఈ కౌంటర్ ఓటింగ్ మీద కూడా మస్క్ స్పందించాడు. తన ప్రతిపాదన ప్రజాదరణ పొందకపోయినా పర్వాలేదని, ఇక్కడ ప్రజల ప్రాణాలే ముఖ్యమని తెలిపాడు. రష్యా ఇప్పుడు సైనిక సమీకరణ చేస్తోందని, క్రిమియా ప్రమాదంలో ఉంటే మాత్రం వాళ్లు పూర్తి యుద్ధానికి వెళ్తారని అన్నాడు. అప్పుడు రెండువైపులా భారీ ప్రాణ నష్టం సంభవిస్తుందని చెప్పాడు. ఉక్రెయిన్‌తో పోలిస్తే రష్యా జనాభా మూడింతల అధికమని, కాబట్టి ఈ యుద్ధంలో ఉక్రెయిన్ విజయం అసంభవమని అతడు అభిప్రాయపడ్డాడు.

Exit mobile version