అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. లాస్ ఏంజెల్స్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు ఓ చిన్నారి స్వాగతం పలికింది. ఆ చిన్నారిని చూసి కేటీఆర్ సంబురపడ్డారు. ఆమె పేరు వినగానే మరింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ చిన్నారి పేరు ఏంటంటే.. కికో … కికో అనగా కరుణమూర్తి. ఆ అమ్మాయి పేరు విన్న కేటీఆర్ ఆమె తల్లిదండ్రులపై ప్రశంసలు కురిపించారు. ఆమె తల్లిదండ్రులు మంచి ఆలోచనాపరులంటూ చెప్పక తప్పదని ప్రశంసించారు. చిన్నారి తన పేరుకు తగ్గట్టుగానే తనతో ఫోటో దిగిందని కేటీఆర్ ట్వీట్ చేశారు.
పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారుల బృందం అమెరికా పర్యటనకు వెళ్లారు. ప్రతినిధుల బృందం అమెరికాలోని లాస్ ఏంజిల్స్, శాన్ డియాగో, సానో హోజే, బోస్టన్, న్యూయార్క్ వంటి నగరాల్లో పర్యటించి అనేక కంపెనీల అధిపతులు, సీనియర్ ప్రతినిధి బృందాలతో సమావేశమవుతారు.
This adorable young girl came with her parents to greet me as I arrived at LA airport
— KTR (@KTRBRS) March 20, 2022
Her parents named her KiCo – Kindness+Compassion😊 Thoughtful parents I must say
True to her name she was kind enough to pose for a pic with me pic.twitter.com/2KTXNvai6f
మంత్రి పర్యటనలో ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పలు ఐటి, ఎలక్ట్రానిక్స్ ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల కంపెనీలతో సమావేశం నిర్వహిస్తున్నారు. గతంలో అమెరికాలో పర్యటించి పెద్దఎత్తున పెట్టుబడులను తెలంగాణకు తీసుకువచ్చారు కేటీఆర్. ఇప్పుడు మళ్ళీ మరిన్ని పెట్టుబడులను తెలంగాణకు తీసుకువచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మంత్రి కేటీఆర్‌తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమలు ఐటీ శాఖకు చెందిన పలు విభాగాల డైరెక్టర్లు ఈ పర్యటనలో వున్నారు. అమెరికాలోని ఎన్నారైలు కేటీఆర్ పర్యటన పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ఏ నగరానికి వెళ్ళినా కేటీఆర్ ని అపూర్వంగా స్వాగతిస్తున్నారు.