World’s Oldest Toilet: ప్రపంచంలోనే అత్యంత పురాతమైన ఫ్లషింగ్ టాయిలెట్ బయటపడింది. చైనా పురాతన శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో 2400 ఏళ్ల నాటి టాయిటెల్ వెలుగులోకి వచ్చింది. చైనాలోని జియాన్ నగరంలో ఓ పురావస్తు ప్రదేశంలో జరిపిన తవ్వకాల్లో టాయిలెట్ బాక్స్, పైపును పరిశోధకులు కనుక్కున్నారు. ఈ టాయిలెట్ యుయాంగ్ లోని ఒక ప్యాలెస్ శిథిలాల్లో కనుగొనబడింది. ఇది వారింగ్ స్టేట్స్ కాలం(424 BC), క్విన్ రాజవంశం (221 BC – 206 BC) నాటిదని పరిశోధకులు భావిస్తున్నారు. పురాతన శాస్త్రవేత్తలు దీన్ని ‘‘లగ్జరీ టాయిలెట్’’గా పిలుస్తున్నారు. బాత్రూమ్ ప్యాలెస్ లోపల ఉందని, దీనిని బయట ఉన్న ఒక గొయ్యితో పైపు ద్వారా కలుపుతోందని పరిశోధకలు వెల్లడించారు.
Read Also: Regina Cassandra: ‘నేనే నా’ రైట్స్ సొంతం చేసుకున్న ఎస్.పి. సినిమాస్!
తవ్వకాలు జరిపిన టీంలో భాగమైన చైనీస్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ పరిశోధకుడు లియు రుయ్ మాట్లాడుతూ.. చైనాలో ఇప్పటి వరకు కనుగొనబడిన మొట్టమొదటి ఏకైక ఫ్లష్ టాయిలెట్ ఇదే అని వెల్లడించారు. ఇలాంటిది కనుగొనడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. దీనిని వారింగ్ స్టేట్స్ కాలంలో, హాన్ రాజవంశం సమయంలో ఉన్నత స్థాయి అధికారులు వాడేవారని పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టాయిలెట్ ను క్విన్ జియాగోంగ్ లేదా అతని తండ్రి క్విన్ జియాన్ గాంగ్ ఉపయోగించారని అంచనా వేస్తున్నారు.
అయితే ఈ టాయిలెట్ ను ఉపయోగించిన ప్రతీసారి రాజు సేవలకులు టాయిలెట్ శుభ్రం చేసేందుకు నీరు పోసేవారని, ప్రాచీన చైనీయులు పారిశుద్ధ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో చెప్పడానికి ఈ ఫ్లష్ టాయిలెట్ ఓ ఉదాహరణ అని లియు రుయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం దొరికిన టాయిలెట్ నుంచి తీసిన మట్టి నమూనాలను పరిశీలిస్తున్నారు. దీన్ని తయారు చేయడానికి వారు ఏలాంటి పదార్థాలను ఉపయోగించారో తెలుసుకోవడానికి పరిశోధిస్తున్నారు.