NTV Telugu Site icon

Chernobyl disaster: చెర్నోబిల్ రేడియేషన్ తట్టుకుని క్యాన్సర్‌ని జయించిన తోడేళ్లు.. కీలక స్టడీలో వెల్లడి..

Wolves Living Near Chernobyl Plant

Wolves Living Near Chernobyl Plant

Chernobyl disaster: చెర్నోబిల్ డిజాస్టర్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అణు విద్యుత్ కర్మాగారంలో పేలుడుతో సోవియట్ యూనియన్‌లోని(ప్రస్తుతం ఉక్రెయిన్) ఈ ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తోంది. 1986లో జరిగిన ఈ విపత్తు కారణంగా ఇప్పటికీ చెర్నోబిల్ నగరాన్ని ప్రజలు విడిచి వెళ్లారు. అణు విధ్వంసం తర్వాత ఇక్కడి వాతావరణంలో ఇప్పటికీ రేడియేషన్ ప్రభావం ఉంది. రేడియేషన్ బారిన పడితే ప్రజలు క్యాన్సర్లకు గురవుతారని ఈ ప్రాంతానికి అనుమతించడం లేదు. విపత్తు జరిగిన ప్రాంతం నుంచి 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఒక నిషేధిత ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. ఇది మొత్తం 2634 చదరపు కి.మీ విస్తరించి చెర్నోబిల్ మినహాయింపు జోన్ (CEZ)గా ఉంది.

అయితే, మనుషులు ఇక్కడి నుంచి దూరంగా ఉన్నప్పటికీ తోడేళ్ల వంటి వన్యప్రాణాలు అక్కడ నివసిస్తున్నాయి. తాజాగా ఓ అధ్యయనంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న తోడేళ్ల రోగనిరోధక వ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నట్లుగా, క్యాన్సర్‌తో పోరాడేలా వాటి రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేసుకున్నట్లు తేలింది. రానున్న కాలంలో వాటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తే, మానవుడు ప్రాణాంతక వ్యాధితో పోరాడేందుకు సాయం చేయవచ్చని అధ్యయనం తెలిపింది.

Read Also: CM Revanth: మీరెప్పుడు రైతుబంధు ఇచ్చారు..? మేము వచ్చి 60 రోజులు కూడా కాలేదు

చెర్నోబిల్ ప్రాంతంలో తిరుగుతున్న తోడేళ్లు, దీర్ఘకాలికంగా గురైనప్పటికీ.. అవి ప్రభావితం కానట్లు కనిపిస్తోందని, గత నెలలో యూఎస్ లోని సొసైటీ ఆఫ్ ఇంటిగ్రేటివ్ అండ్ కంపారిటివ్ బయాలజీ వార్షిక సమావేశంలో సమర్పించిన అధ్యయనం పేర్కొంది. దీనికి ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలోని షేన్ కాంప్‌బెల్-స్టాటన్ ల్యాబ్‌లో పరిణామ జీవశాస్త్రవేత్త మరియు ఎకోటాక్సికాలజిస్ట్ కారా లవ్ నాయకత్వం వహించారు. ఆమె తొమ్మిదేళ్లుగా CEZ వద్ద తోడేళ్ళను అధ్యయనం చేస్తోంది.

అధ్యయనం ప్రకారం.. ప్రతీరోజూ తోడేళ్లు 11.28 మిల్లీమీటర్ల రేడియేషన్‌కి గురవుతున్నాయి. ఇది మానవుడి భరించే రేడియేషన్ కన్నా 6 రెట్లు ఎక్కువ. చెర్నోబిల్ లోని తోడేళ్లలో రోగనిరోధక వ్యవస్థ ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని తోడేళ్ల కన్నా భిన్నంగా ఉందని, వాటి జన్యువులు క్యాన్సర్‌ని తట్టుకోగలదని పరిశోధన బృందం కనుగొంది. వాటి జన్యువులోని నిర్దిష్ట ప్రాంతాలను వారు గుర్తించారు, ఇది క్యాన్సర్‌ని అడ్డుకున్నట్లుగా తేలింది. మానవుల్లో ఇలాంటి జన్యు ఉత్పరివర్తన క్యాన్సర్‌ నుంచి మనుగడ సాగించేందుకు సాయం చేస్తాయనే విషయాన్ని పరిశోధకులు పరిశీలించనున్నారు. ఈ ప్రాంతంలో నివసించే కుక్కలపై కూడా ఇలాంటి ప్రభావాలే కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు.