World Protests: ఫ్రాన్స్ నుంచి అమెరికా వరకు.. 8 దేశాల్లో నిరసనల సెగ.. కారణాలివే!

  • ఫ్రాన్స్‌లో హింసాత్మకంగా మారుతున్న నిరసనలు..
  • బెల్జియం, పోర్చుగల్, ఇటలీ, అల్బేనియా, టర్కీ, అర్జెంటీనా, యూఎస్‌లో కూడా..
France Protest

France Protest

World Protests: అల్లర్లు, నిరసనలతో ప్రపంచ దేశాలు అట్టుడుకుతున్నాయి. ఫ్రాన్స్‌లో విద్యార్థి ఉద్యమంగా మొదలైన నిరసనలు, ఇప్పుడు పతాక స్థాయికి చేరాయి. హింసాత్మక సంఘటలు చెలరేగుతున్నాయి. నిరసనకారులు దోపిడీదారులుగా మారారు. వాహనాలకు నిప్పు పెట్టడం, దుకాణాల్లో దోచుకోవడం చేస్తున్నారు. ప్రముఖ భవనాలను కూడా బుగ్గి చేస్తున్నారు. ఈ అల్లర్లను అణిచివేసేందుకు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ ప్రభుత్వం తీవ్రంగా కష్టపడుతోంది.

ఇదిలా ఉంటే, ఒక్క ఫ్రాన్స్‌లో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. ఇటలీ, అల్బేనియా నుంచి అర్జెంటీనా, టర్కీ వరకు ప్రజలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, గృహ సంక్షోభానికి వ్యతిరేకంగా నిరసనలు చేపబుతున్నారు. ఫ్రాన్స్, అల్బేనియాల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రం అవుతున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈ అల్లర్లు చెలరేగాయి.

ఫ్రాన్స్:

ఫ్రాన్స్‌లో నిరసనలకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒక వైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇంధన ధరలపై ప్రజాగ్రహం ఉంది. మరోవైపు పాఠశాలల పరిస్థితులు బాగా లేకపోవడం, విద్యా బడ్జెట్‌లో కోతలపై విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు. గత నెలలో పారిస్‌లో ప్రారంభమైన ఈ అల్లర్లు క్రమంగా దేశం మొత్తం వ్యాపించాయి. ఫ్రాన్స్ ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం.. ప్రజల కొనుగోలు శక్తి తగ్గడానికి వ్యతిరేకంగా 5 లక్షల మంది ప్రదర్శనల్లో పాల్గొన్నట్లు చెప్పింది.

బెల్జియం:

ఫ్రాన్స్ పొరుగుదేశమైన బెల్జియంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ప్రభుత్వ వ్యయాల కోతలు, పెరుగుతున్న ఇంటి ఖర్చులు, ఉన్నత విద్య, యూనివర్సిటీల్లో ఫీజుల పెంపుకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు.

పోర్చుగల్:

ద్రవ్యోల్బణం పెరుగుతుండటంపై పోర్చుగల్‌లో నిరసనలు జరుగుతున్నాయి. ఇళ్లు కొనుగోలు ధరలు పెరగడంపై రాజధాని లిస్బన్‌లో వేలాది మంది ప్రదర్శన నిర్వహించారు. 2017 నుంచి లిస్బన్‌, ఇతర నగరాల్లో ప్రాపర్టీ ధరలు రెట్టింపయ్యాయి. అదే సమయంలో అద్దెలు కూడా విపరీతంగా పెరిగాయి.

ఇటలీ:

ఇటలీ కూడా ఇలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొంటోంది. మిలన్‌లో వేతనాలు నిలిచిపోవడం, ద్రవ్యోల్బణం, రోజూవారీ ఖర్చులు తీర్చడంలో ఎదురవుతున్న ఇబ్బందులకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన తెలిపారు.

అల్బేనియా, టర్కీ:

అల్బేనియాలో యూనివర్సిటీల్లో సౌకర్యాలు లేకపోవడం, అధిక విద్యా వ్యయం, ఉపాధి లేకపోవడానికి నిరసనగా విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. టర్కీలో కూడా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, సరిపోని పెన్షన్ చెల్లింపులకు వ్యతిరేకంగా పెన్షనర్లు, కార్మిక సంఘాలు నిరసన తెలిపాయి.

అర్జెంటీనా, అమెరికా:

లాటిన్ అమెరికా దేశం అర్జెంటీనా రాజధాని బ్యూనర్ ఎయిర్స్‌లో అధ్యక్షుడు జేవియర్ మైలీ తీసుకువచ్చిన ఉన్నత విద్యా విధానానికి నిరసనగా విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తున్నారు.

అమెరికాలో ‘‘నో కింగ్స్’’ పేరుతో నిరసనకారులు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ర్యాలీలు నిర్వహించారు.