NTV Telugu Site icon

Israel: యుద్ధం తర్వాత గాజాను ఎవరు పాలిస్తారు.? ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఏమన్నారంటే..

Benjimin Netanyahu

Benjimin Netanyahu

Israel: అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై దాడికి పాల్పడ్డారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాస్ట్రిప్‌పై దాడులు చేస్తోంది. హమాస్ ఉగ్రవాదుల్ని పూర్తిగా తుడిచిపెట్టే వరకు విశ్రమించేది లేదని ఇజ్రాయిల్ చెప్పింది. అమెరికాతో పాటు ఇతర యూరోపియన్, అరబ్ దేశాలు చెప్పినా కూడా ప్రస్తుతం ఇజ్రాయిల్ వినే పరిస్థితిలో లేదు. గాజాపై భూతల దాడులు చేస్తోంది. హమాస్ టన్నెల్ వ్యవస్థతో పాటు కీలక ఉగ్రవాదుల్ని మట్టుపెట్టే ప్రయత్నంలో ఉంది.

Read Also: South Central Railway: పండుగల సీజన్‌.. రైళ్ల రాకపోకలపై దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక దృష్టి

ఇదిలా ఉంటే పాలస్తీనాకు మద్దతు తెలిపే కొన్ని దేశాలు గాజాను ఇజ్రాయిల్ ఆక్రమించాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. 2007 నుంచి హమాస్ మిలిటెంట్లే గాజాను పరిపాలిస్తున్నారు. 24 లక్షల మంది ఉండే ఈ ప్రాంతం ప్రస్తుతం యుద్ధం కారణంగా తీవ్ర మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాలస్తీనాలో మరో భాగమైన వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని పాలస్తీనా అథారిటీ పాక్షిక పరిపాలన నియంత్రణ కలిగి ఉంది. అయితే ఈ నెల ప్రారంభంలో యూఎస్ విదేశాంగ మంత్రి బ్లింకెన్, పాలస్తీనా అధ్యక్షుడి మహ్మద్ అబ్బాస్‌తో సమావేశమయ్యారు. వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం, గాజా స్ట్రిప్ ప్రాంతాల వివాదానికి సమగ్ర రాజకీయ పరిష్కారం లభిస్తేనే గాజాలో పాలస్తీనా అథారిటీ అధికారాన్ని చెపట్టగలనది అబ్బాస్ అన్నారు.

గాజా ఆక్రమించే ఉద్దేశం లేదు: బెంజిమిన్ నెతన్యాహు

గాజాను ఆక్రమించుకునే ఉద్దేశం తమకు లేదని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ చెప్పారు. ఇజ్రాయిల్ 1967లో గాజా ప్రాంతాన్ని ఆక్రమించింది, ఆ తర్వాత 2005లో ఉపసంహరించుకుంది. అధికారాన్ని పాలస్తీనా అథారిటీకి అప్పగించింది. ‘‘ మేము గాజాను పరిపాలించడానికి ప్రయత్నించము. మేము దానిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించం, కానీ మేము దానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాము’’ అని నెతన్యాహు చెప్పారు. గాజాను పునర్నిర్మించాల్సి ఉందని, పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నెతన్యాహు అన్నారు.