Karima Baloch: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా తీవ్రంగా స్పందిస్తోంది. ఏకంగా భారత్ ఈ హత్య చేయించిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. భారత దౌత్యవేత్త పవన్ కుమార్ రాయ్‌ని బహిష్కరించింది. ఇదే విధంగా భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. ఖలిస్తాన్ ఉగ్రవాదిగా భారత్ చేత ప్రకటించబడిన నిజ్జర్ హత్యపై కెనడా ప్రభుత్వం గగ్గోలు పెడుతోంది. కెనడా భూభాగం భారత వ్యతిరేక చర్యలకు కేంద్రంగా మారుతోందని, భారత్ ఎన్నో సార్లు అభ్యంతరం తెలిపినా కూడా పట్టించుకోలేదు. కెనడాలో రాడికల్ సిక్కు సమాజం అక్కడి ప్రభుత్వంపై గణనీయమైన ప్రభావం చూపిస్తోంది.
ఇదిలా ఉంటే నిజ్జర్ హత్యలో భారత్ ను నిందిస్తున్న కెనడా.. పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ స్వతంత్రం కోసం, అక్కడ పాక్ సైన్యం చేస్తున్న అకృత్యాలపై గళమెత్తిన హక్కుల కార్యకర్త కరీమా బలూచ్ హత్యను మాత్రం కెనడా అసలు పట్టించుకోలేదు. ఈ హత్య వెనక పాకిస్తాన్ శక్తులు ఉన్నాయని పలు సంఘాలు ఆరోపించినా కూడా అక్కడి ప్రభుత్వం నిమ్మకునీరెత్తని విధంగా ఉంది. చివరకు కరీమ బలూచ్ హత్యను కెనడా పోలీసులు ‘నాన్-క్రిమినల్’గా పేర్కొంది.
Read Also: Womens Reservation Bill: 16 రాష్ట్రాల్లో బీజేపీనే ఉంది.. కానీ ఒక్క మహిళా సీఎం లేరు
కరీమా బలూచ్ హత్య:
కెనడాలోని టొరంటోలో ప్రవాసంలో ఉన్న బలూచ్ కార్యకర్త కరీమా బలూచ్ డిసెంబర్ 20, 2020న అదృశ్యమయ్యారు. మరుసటి రోజు బలూచ్ అనుమానాస్పద పరిస్థితుల్లో టొరంటో డౌన్‌టౌన్ వాటర్‌ఫ్రంట్ లోని ఒంటారియో సరస్సు సమీపంలో శవమై కనిపించింది. దీనిపై కెనడా ఉన్నతస్థాయి విచారణ ప్రారంభించాలని కోరారు. అయితే దీనిపై ఆ దేశం స్పందించలేదు.
ఎవరీ కరీమా బలూచ్:
బలూచ్ మానవహక్కుల కార్యకర్తగా, న్యాయవాదిగా కరీమా బలూచ్ గుర్తింపు పొందారు. బలూచిస్తాన్ లో పాకిస్తాన్ అఘాయిత్యాలు, అణిచివేత, అక్కడి ప్రజలు అదృశ్యమవ్వడంపై పోరాడారు. మానవ హక్కుల రంగంలో కృషి చేసినందుకు 2016లో బీబీసీ 100 మంది అత్యంత స్పూర్తిదాయకమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది. బలూచ్ నేషనల్ మూవ్‌మెంట్, బలూచిస్తాన్ నేషనల్ పార్టీ-కెనడా, వరల్డ్ సింధీ కాంగ్రెస్-కెనడా, పష్తున్ కౌన్సిల్ సంఘాలు కెనడా కరీమా హత్యపై విచారణ జరపాలని కోరాయి.