Joe Biden: అమెరికా అధ్యక్షుడి పదవీ బాధ్యతల నుంచి జో బైడెన్ తప్పుకున్నారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వీడింది కేవలం కార్యాలయాన్నే, పోరాటాన్ని కాదు అన్నారు. అయితే, వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ రోటుండాలో యూఎస్ 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి ముందు బైడెన్ దంపతులు సంప్రదాయం ప్రకారం ట్రంప్ దంపతులకు తేనీటి విందు ఇచ్చారు. వెల్‌కమ్ హోం అంటూ ట్రంప్‌కు బైడెన్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు సంప్రదాయబద్ధంగా లేఖ రాశారా అని మీడియా ప్రశ్నించగా.. అవునంటూ జో బైడెన్ ఆన్సర్ ఇచ్చారు. అయితే, అందులో ఏముందనేది మాత్రం రహస్యమన్నారు.
Read Also: Tollywood : బడా నిర్మాతల ఇల్లు, ఆఫీసులో ఐటి అధికారుల దాడులు
అయితే, డొనాల్డ్ ట్రంప్ బాధ్యతల స్వీకరణ తర్వాత జో బైడెన్ కాలిఫోర్నియాకు వెళ్లి పోతూ.. మేము వీడింది కేవలం కార్యాలయాన్నే.. పోరాటాన్ని కాదని వెల్లడించారు. అంతేకాదు.. ఈరోజు ప్రారంభోపన్యాసం విన్నాం.. మనం ఇంకా చేయాల్సింది చాలా ఉందని వెల్లడించారు. తాను రాజకీయాల నుంచి ఇప్పుడే తప్పుకోను.. ప్రజా జీవితంలో కొనసాగుతానని అతడు స్పష్టం చేశారు. ఆ తర్వాత జో బైడెన్ దంపతులు హెలికాఫ్టర్ ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక, సాధారణంగా అమెరికా అధ్యక్షులుగా పని చేసిన వారు పదవి నుంచి వైదొలగిన తర్వాత ప్రజా జీవితానికి దూరమైపోతుంటారు. కానీ బైడెన్ తాను అలా చేయనని చెప్పడం గమనార్హం.