Site icon NTV Telugu

Putin: 2030 వరకు రష్యా అధ్యక్షుడిగా పుతిన్..

Putin

Putin

Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2024 ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి అధ్యక్ష పదవిని కైవసం చేసుకోవాలని అనుకుంటున్నారు. దీంతో ఆయన 2030 వరకు అధికారంలో ఉండేందుకు మార్గం సుగమం అవుతుందని ది టెలిగ్రాఫ్ ఒక నివేదికలో పేర్కొంది. 1999లో బోరిస్ యెల్ట్సిన్ నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన పుతిన్ అప్పటి నుంచి అధికారంలో కొనసాగుతున్నారు. జోసెఫ్ స్టాలిన్ తర్వాత రష్యాకు అత్యధిక కాలం అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు.

రష్యాలో మార్చి 2024లో ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ నెలలో క్రెమ్లిన్ ప్రతినిధి డెమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. పుతిన్ పోటీ చేయాలనుకుంటే, మరెవరు కూడా అతనిపై పోటీ చేయలేరని అన్నారు. రష్యా రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన అధ్యక్షుడు 6 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారు. దీంతో 2024లో పుతిన్ మళ్లీ ఎన్నికైతే 2030 వరకు అత్యున్నత పదవిలో కొనసాగుతారు. 2021లో రష్యా ప్రజలు కేవలం రెండుసార్లు మాత్రమే అధ్యక్ష పదవికి పోటీ పడేలా చట్టంపై పుతిన్ సంతకం చేశారు. అయితే ఈ చట్టం ప్రకారం పుతిన్ మరో రెండుసార్లు పోటీ చేసే అవకాశం ఏర్పడింది.

Read Also: Minister KTR Exclusive Interview: ఎన్టీవీ లైవ్‌లో మంత్రి కేటీఆర్‌..

ప్రస్తుతం 71 ఏళ్ల పుతిన్ మరోసారి అధ్యక్షుడు కావాలని చాలా మంది రష్యన్ నేతలు కోరుకుంటున్నారు. 80 శాతం మద్దతు ఆయనకే ఉంది. అయితే పుతిన్‌కి పోటీ ఇచ్చే వారు ప్రస్తుతం రష్యాలో లేరు. ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి పుతిన్ ఎన్నిక లాంఛనమే అవుతుంది.

గతేడాది ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. ఈ సమయంలో పుతిన్ మరోసారి అధ్యక్షుడిగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. యుద్ధం కారణంగా వెస్ట్రన్ దేశాలు అనేక ఆర్థిక ఆంక్షలు విధించినప్పటికీ పుతిన్ ఎక్కడా తగ్గడం లేదు. ఉక్రెయిన్ లో యుద్ద నేరాలకు పాల్పడుతున్నాడని చెబుతూ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కారణంగా పుతిన్ ఎక్కువగా ఇతర దేశాలకు వెళ్లడం లేదు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలిసారిగా పుతిన్ కిర్గిజ్‌స్తాన్, చైనా పర్యటనకు వెళ్లారు.

Exit mobile version