Site icon NTV Telugu

Putin: తిరుగుబాటు నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న పుతిన్..

Putin 2

Putin 2

Putin: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్లు రష్యా తరుపున పోరాడిని కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ ఏకంగా రష్యా ప్రభుత్వం, సైన్యంపైనే తిరుగుబాటు చేసింది. తాము చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే తమ చావు రష్యా ప్రజల కోసమే అంటూ వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ అన్నారు. రష్యాలో మిలిటరీ నాయకత్వాన్ని కూలుస్తామని, అధ్యక్షుడు పుతిన్ కే వార్నింగ్ ఇచ్చాడు. అన్యాయంగా తమ సైనికులను రష్యన్ ఆర్మీ చంపేస్తోందని ఆరోపించారు. రష్యా దాడుల్లో తమ సైన్యం వేలల్లో చనిపోతోందని దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.

Read Also: Maruti Suzuki WagonR CNG Price: 80 వేలకే మారుతీ వేగనార్ సీఎన్‌జీ.. 34 కిలోమీటర్ల మైలేజ్!

ఇదిలా ఉంటే రష్యాలో సాయుధ తిరుగుబాటు నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ముఖ్య ప్రాంతాల్లో బలగాలను పెంచింది. తిరుగుబాటు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు క్రెమ్లిన్ ప్రకటించింది. తిరుగుబాటును ఎదుర్కొనేందుకు త్వరలోనే దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ రష్యన్ వార్తా సంస్థలకు తెలియజేశారు.

మరోవైపు వాగ్నర్ గ్రూప్ రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లోని పట్టణాలను స్వాధీనం చేసుకునేందుకు సమాయత్తం అవుతోంది. ఇప్పటికే రష్యన్ ఆర్మీకి సంబంధించిన ఒక హెలికాప్టర్‌ని కూల్చేసినట్లు వాగ్నర్ గ్రూప్ వెల్లడించింది. మరోవైపు తిరుగుబాటు ప్రారంభించిన ప్రిగోజిన్‌పై క్రిమినల్ విచారణ ప్రారంభించినట్లు రష్యా ప్రభుత్వం తెలిపింది. మరోవైపు 25000 మంది బలగం తమతో ఉందని, రష్యా ప్రజలు కూడా తమతో చేరాలని, మేం తిరుగుబాటు చేయడం లేదని, న్యాయం కోసం పోరాడుతున్నామని ప్రిగోజిన్ అన్నారు.

ప్రస్తుతం వాగ్నర్ గ్రూప్ రోస్తోవ్ లోని మిలిటరీ కార్యాలయాన్ని ఆధీనంలోకి తసుకుంది. రష్యాలోని దక్షిణ ప్రాంతమైన రోస్తోవ్ లోని మిలిటరీ కార్యాలయం నుంచి ప్రిగోజిన్ ఓ వీడియోను విడుదల చేసి.. చీఫ్ ఆఫ్ స్టాఫ్ గెరాసియోమ్, రక్షణ మంత్రి సెర్గీ సోయిగు తనతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే వాగ్నర్ సేనలు మాస్కో వైపు వెళ్లాయని.. రోస్తోవ్ ను దిగ్బంధం చేస్తాయని హెచ్చరించారు. మరోవైపు గెరాసిమోవ్ మిలిటరీ కార్యాలయం నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.

Exit mobile version