NTV Telugu Site icon

Putin: ఐదోసారి అధ్యక్ష పోటీకి పుతిన్ సిద్ధం.. కేజీబీ ఏజెంట్‌ నుంచి రష్యా అధినేత వరకు రాజకీయ ప్రస్థానం..

Putin

Putin

Putin: రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్(71) మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే గత రెండు దశాబ్ధాలుగా పుతిన్ రష్యాకు అధ్యక్షుడిగా ఉన్నారు. సోవియట్ అధ్యక్షుడిగా ఎక్కువ కాలం పనిచేసిన స్టాలిన్ రికార్డును కూడా పుతిన్ బద్ధలు కొట్టారు. తాజాగా అక్కడి శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 17న అధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రోజు రష్యా కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై సమావేశమైంది.

ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై రష్యాలో రాజ్యాంగ సవరణ జరిగింది. దీని ద్వారా పుతిన్ మరో రెండుసార్లు అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు మార్గం సుగమం అయింది. రష్యాలో అధ్యక్షుడి పదవీకాలం ఆరేళ్లు, దీనిని బట్టి చూస్తే పుతిన్ 2024 నుంచి 2036 వరకు రెండు సార్లు పదవిలో ఉండేందుకు అవకాశం ఏర్పడింది. దీనికి తోడు పుతిన్‌కి రష్యాలో ప్రత్యర్థి లేకుండా పోయారు. ప్రతిపక్ష నేతగా ఉన్న అలెక్సీ నావెన్సీని పలు ఆరోపణలపై జైలులో ఉంచారు.

పుతిన్ రాజకీయ ప్రస్తానం:

*పుతిన్ సోవియట్ యూనియన్ గూఢచార సంస్థ కేజీబీ అధికారిగా తన జీవితాన్ని ప్రారంభించారు.
* సోవియట్ పతనానంతరం రష్యా మొదటి అధ్యక్షుడు యెల్ట్సిన్, 1999లో ప్రధానిగా పుతిన్‌ని నియమించారు.
* యెల్ట్సిన్ రాజీనామా చేయడంతో, ప్రధానిగా ఉన్న పుతిన్ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
*పుతిన్ మార్చి 2000లో తన మొదటి అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి మొదటిసారిగా, 2004లో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
* సోవియట్ పతనం తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థలో సంక్షోభాన్ని గట్టెక్కించడం, స్థిరత్వం తీసుకురావడంలో పుతిన్ ప్రజాదరణ పొందారు.
* ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ పుతిన్‌ని ‘అద్భుతమైన నాయకుడు’ అని కొనియాడారు.
* 2002, అక్టోబర్ 23న చెచెన్యా తిరుగుబాటుదారులు మాస్కోలోని ఓ థియేటర్‌లో 850 మందిని బందీలుగా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో పుతిన్ సమర్థవంతంగా వ్యవహరించారు. పుతిన్ దళాలు థియేటర్‌లోకి విష వాయువును పంపి మిలిటెంట్లను హతమార్చారు. అయితే ఈ ఘటనో 130 మంది బందీలు మరణించినప్పటికీ.. తన చర్యను సమర్థించుకుంటూ, వందలాది మందిని కాపాడినట్లు తెలిపారు.
* అధ్యక్షుడిగా రెండు సార్లు పనిచేసిన తర్వాత 2008లో తిరిగి ప్రధాని అయ్యారు. రష్యాకి వరసగా రెండుసార్లు అధ్యక్ష పదవి చేపట్టడం నిషేధం కావడంతో దీనిని అధిగమించేందుకు ప్రధానిగా పనిచేశారు.
* 2012లో మూడోసారి, 2018లో రష్యాలో ప్రజాస్వామ్యం కోసం నిరసనలు కొనసాగుతున్నప్పటికీ.. 2018లో నాలుగోసారి గెలిచి అధ్యక్ష పదవిని చేపట్టారు.
* 2012లో రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి వరకు నాలుగేళ్లు ఉన్న అధ్యక్ష పదవిని 6 ఏళ్లకు పెంచారు.
* సోవియట్ పతనం తర్వాత రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో వెస్ట్రన్ దేశాలను డైరెక్టుగా ఎదుర్కొంటోంది. ఈ యుద్ధం అక్కడి ప్రజల్లో పుతిన్ పట్ల నమ్మకం ఏర్పడేలా చేసింది.
* వెస్ట్రన్ దేశాల ఆంక్షల నేపథ్యంలో భారత్,చైనాలో మిత్రుత్వం రష్యాను ఆర్థికంగా ఆదుకుంది.

జార్జియా, ఉక్రెయిన్ యుద్ధం:

2008లో రష్యా సైన్యం దక్షిణ ఒస్సేటియా, అబ్ఖాజియా కోసం జార్జియాతో స్వల్పకాలిక యుద్ధం చేశారు. ఐదు రోజులు జరిగిన యుద్ధంలో రెండు వైపులా వందలాది మంది మరణించారు. రష్యాకు అనుకూలంగా ఉన్న ఈ భూభాగాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఉక్రెయిన్‌లో భాగంగా ఉన్న క్రిమియాను రష్యాలో భాగంగా చేశాడు.

2022, ఫిబ్రవరి24న ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించాడు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కి అమెరికాతో పాటు పలు యూరప్ దేశాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. అయినా కూడా రష్యా, ఉక్రెయిన్‌తో పాటు దాని మిత్రదేశాలను ఎదుర్కొంటోంది. జూన్ 2023లో, వాగ్నెర్ నాయకుడు యెవ్జెనీ ప్రిగోజిన్ పుతిన్‌పై తిరుగుబాటు చేసిన క్రమంలో ఆయన ఓ విమాన ప్రమాదంలో హతమయ్యాడు. ఈ దాడి వెనక పుతిన్ ఉన్నాడనే వాదనలు ఉన్నాయి.