Ali Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియలపై షాకింగ్ రిపోర్ట్.. అమెరికా భయంతో 13 దేశాలు దూరం!

  • ఖమేనీ అంత్యక్రియల్లో అగ్రరాజ్యం మైండ్ గేమ్
  • అమెరికా దెబ్బకు వెనక్కి తగ్గిన 13 దేశాలు
Khamenei Funeral

Khamenei Funeral

Ali Khamenei Funeral: ఇరాన్ మాజీ సర్వోన్నత నేత (సుప్రీం లీడర్) అయాతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ అంతర్జాతీయ దౌత్య రాజకీయం తీవ్ర సంచలనంగా మారింది. అమెరికా తీవ్రంగా ఒత్తిడి తీసుకురావడంతో.. కనీసం 13 దేశాలు ఖమేనీ అంతిమ వీడ్కోలు వేడుకలకు దూరం జరిగాయని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ‘తస్నీమ్’ ఒక సంచలన కథనంలో వెల్లడించింది. తేహ్రాన్ నడిబొడ్డున ఉన్న ‘ఇమామ్ ఖొమేని గ్రాండ్ ముసల్లా’లో ఈ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

సీక్రెట్ ఆదేశాలు జారీ చేసిన మార్కో రుబియో

తస్నీమ్ నివేదిక ప్రకారం.. జూన్ 26న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలకు (ఎంబసీలు), దౌత్య మిషన్లకు అత్యంత రహస్య ఆదేశాలు జారీ చేశారు. ఖమేనీ అంత్యక్రియలకు ఏ దేశమైనా హాజరైతే, దానిని అమెరికా శతృత్వ చర్యగా పరిగణిస్తుందని.. ఆయా దేశాలతో అమెరికా దౌత్య సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించాల్సిందిగా రుబియో ఆదేశించినట్లు ఈ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలపై అమెరికా తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఖమేనీ అంత్యక్రియలకు హాజరైతే ఆయా దేశాలకు అమెరికా ఇచ్చే అభివృద్ధి నిధులను (డెవలప్‌మెంట్ ఎయిడ్) కట్ చేస్తామని అమెరికా రాయబారులు హెచ్చరించినట్లు సమాచారం. దీనితో పాటు ఐదు అరబ్ దేశాల విదేశాంగ మంత్రులతో మార్కో రుబియో స్వయంగా ఫోన్లలో మాట్లాడి ఒత్తిడి తెచ్చినట్లు తస్నీమ్ వెల్లడించింది.

వెనక్కి తగ్గిన ఆ 13 దేశాలు ఇవే..

అమెరికా హెచ్చరికల నేపథ్యంలో తూర్పు ఐరోపాకు చెందిన 3 దేశాలు, ఆఫ్రికాకు చెందిన 5 దేశాలు, పర్షియన్ గల్ఫ్‌కు చెందిన 2 అరబ్ దేశాలు, తూర్పు ఆసియాకు చెందిన 2 పెద్ద దేశాలు ఇరాన్ పర్యటనలను రద్దు చేసుకున్నాయని తస్నీమ్ నివేదిక వెల్లడించింది. అయితే భద్రతా, దౌత్య కారణాల దృష్ట్యా ఆ దేశాల పేర్లను నివేదికలో వెల్లడించలేదు. కొన్ని దేశాలు తాము రాలేకపోతున్నామనే సమాచారాన్ని జెనీవా, న్యూయార్క్ దౌత్య మిషన్ల ద్వారా ఇరాన్‌కు చేరవేయగా.. మరికొన్ని దేశాలు చిన్న స్థాయి అధికారులను పంపే ప్రయత్నం చేశాయి. కానీ ఇరాన్ అధికారులు ఆ తక్కువ స్థాయి ప్రతినిధులను అనుమతించేందుకు నిరాకరించారు.

ముగిసిన చివరి ప్రార్థనలు..

ఆదివారం తేహ్రాన్‌లో అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు సభ్యులకు అంతిమ ప్రార్థనలు (నమాజ్) నిర్వహించారు. శనివారం నుంచే ఖమేనీ పార్థివ దేహాన్ని ఇమామ్ ఖొమేని గ్రాండ్ ముసల్లాలో ప్రజల సందర్శనార్థం ఉంచగా, లక్షలాది మంది ప్రజలు ఆయనకు వీడ్కోలు పలికేందుకు తరలివచ్చారు. అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే ఇజ్రాయెల్ నుంచి ఆయనకు ప్రాణహాని తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, కట్టుదిట్టమైన భద్రతా కారణాల వల్ల ముజ్తబా ఖమేనీ తన తండ్రి అంతిమ వీడ్కోలు కార్యక్రమాలకు హాజరుకావడం లేదని ‘అల్ జజీరా’ నివేదించింది.