NTV Telugu Site icon

US: భారతీయ స్కాలర్ బాదర్ ఖాన్‌కు ఊరట.. బహిష్కరణను అడ్డుకున్న కోర్టు

Usjudge

Usjudge

హమాస్‌తో సంబంధాలు ఉన్నాయంటూ భారతీయ పరిశోధకుడు బాదర్ ఖాన్ సూరిని అరెస్ట్ చేసి అమెరికా బహిష్కరించింది. అయితే ఈ బహిష్కరణను వర్జీనియా కోర్టు అడ్డుకుంది. తదుపరి ఉత్వర్వులు ఇచ్చేంత వరక బహిష్కరణపై నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశించింది.

బాదర్ ఖాన్ సూరి.. భారతీయ పౌరుడు. ఇరాక్-ఆప్ఘనిస్థాన్‌లో శాంతి నిర్మాణంపై డాక్టరల్ పరిశోధన కోసం అమెరికాలోని జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ చేసేందుకు వీసా లభించింది. ప్రస్తుతం యూనివర్సిటీలో ఉంటూ స్కాలర్‌గా కొనసాగుతున్నాడు.

అయితే సోమవారం వర్జీనియాలోని తన ఇంటి వెలుపల ఉండగా బాదర్ ఖాన్ సూరిని హోంల్యాండ్ సెక్యూరిటీ బృందం అరెస్ట్ చేసింది. బాదర్ ఖాన్ సూరి హమాస్ మద్దతుగా.. యూదు దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని.. అంతేకాకుండా హమాస్ ఉగ్రవాదితో కూడా సంబంధాలు ఉన్నాయంటూ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతినిధి ట్రిసియా మెక్‌లాఫ్లిన్ ఎక్స్‌లో పేర్కొన్నాడు. అనంతరం ఇమ్మిగ్రేషన్ అధికారులు.. బహిష్కరణ వేటు వేశారు.

అయితే బహిష్కరణ వేటును బాదర్ ఖాన్ సూరి లాయర్.. వర్జీనియాలో కోర్టులో సవాల్ చేశారు. బాదర్ ఖాన్ భార్య.. పాలస్తీనాకు చెందిన అమెరికా పౌరురాలు కాబట్టే.. సూరిపై హమాస్ ముద్ర వేస్తు్న్నారని.. ఉగ్రవాదులతో అతనికి ఎలాంటి సంబంధంలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న వర్జీనియా తూర్పు జిల్లా కోర్టు న్యాయమూర్తి ప్యాట్రిసియా టోలివర్ గైల్స్ కీలక తీర్పు వెలువరించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు సూరిని అమెరికా నుంచి బహిష్కరించకూడదని ఆదేశాలు ఇచ్చారు. ఇదిలా ఉంటే హమాస్‌తో సంబంధాలు ఉన్నట్లు వచ్చిన ఆరోపణలను జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీ కూడా ఖండించింది. ఎటువంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తమకు తెలియదని.. నిర్బంధానికి సంబంధించిన సమాచారం కూడా తమకు తెలియజేయలేదని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం బాదర్ ఖాన్ సూరి లూసియానాలోని ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

బ్యాగ్రౌండ్ ఇదే..
బాదర్ ఖాన్ సూరి.. 2020లో న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాలో పీహెచ్‌డీ పూర్తి చేశాడు. మరొక పరిశోధన కోసం అమెరికాలోని జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హమాస్‌కు అనుకూలంగా.. యూదు మతానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో అరెస్ట్ చేశారు.