US-Iran: శాంతి ఒప్పందంపై ప్రతిష్టంభన.. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు!

  • ఇరాన్ ఒప్పందంపై ట్రంప్, జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు
  • నచ్చకపోతే మళ్లీ బాంబులే!
  • టెన్షన్ పుట్టిస్తోన్న తాజా వ్యాఖ్యలు
Jdvance

Jdvance

అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. జీ 7 సదస్సు వేదికగా ఫ్రాన్స్‌లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే పశ్చిమాసియాలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొనే దుస్థితి కనిపిస్తోంది. చర్చల్లో తేడా వస్తే ఇరాన్‌పై దాడి చేయడానికి ఏ మాత్రం వెనుకడబోమని హెచ్చరించారు. ఇరాన్‌తో ఒప్పందం ఇంకా తుది రూపం దాల్చలేదని.. అవసరమైతే దాన్ని రద్దు చేసే అవకాశం కూడా ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చల భవిష్యత్తుపై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇరాన్‌తో ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందం జరగలేదని వాదించారు. దీంతో మళ్లీ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రముఖ వ్యాఖ్యాత మెగిన్ కెల్లీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇరాన్‌తో కుదిరిన అవగాహన ఒప్పందం చట్టబద్ధంగా బంధించే ఒప్పందం కాదని తెలిపారు. అమెరికాలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తే లేదా పరిస్థితులు మారితే ఈ ఒప్పందాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెగిన్ కెల్లీ మాట్లాడుతూ.. ‘‘ఒప్పందంపై ఇప్పటికే సంతకం చేశారు. కానీ ఇది శాశ్వత చట్టపరమైన ఒప్పందం కాదు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తే దీనిని రద్దు చేయవచ్చు కదా?’’ అని ప్రశ్నించగా.. వాన్స్ అంగీకరించారు.

×
×
Ad

అనంతరం వాన్స్ మాట్లాడుతూ.. ‘‘ఇరాన్ అణ్వాయుధాల విషయంలో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే విషయంలో తన ప్రవర్తన మార్చుకుంటే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం కల్పిస్తాం. అలా చేయకపోతే అవకాశం ఉండదు. ఈ ఒప్పందం సారాంశం అంతే’’ అని వివరించారు.

ట్రంప్ కూడా అదే సంకేతాలు

ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సులో ట్రంప్‌ను ఒక విలేకరి శాంతి ఒప్పందం తుది రూపం దాల్చిందా అని ప్రశ్నించగా.. ‘‘లేదు. ఇది కేవలం అవగాహన ఒప్పందం మాత్రమే. అది నాకు నచ్చకపోతే మళ్లీ కాల్పులు మొదలుపెడతాం. వారి తలలపై బాంబులు వేస్తాం. వారు సరిగా ప్రవర్తించకపోతే మళ్లీ అదే పరిస్థితి వస్తుంది’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ట్రంప్, వాన్స్ ఇద్దరి వ్యాఖ్యలను బట్టి చూస్తే.. అమెరికా ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని శాశ్వత పరిష్కారంగా కాకుండా షరతులతో కూడిన ప్రారంభ దశగా మాత్రమే చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా.. ఈ ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా పత్రం తమ దగ్గర ఉందంటూ కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అయితే వాటిని వైట్ హౌస్ ఖండించింది.

శుక్రవారం అధికారిక సంతకం?

ఇరాన్ ఒప్పందం పూర్తి పాఠ్యాన్ని జెనీవాలో శుక్రవారం జరిగే అధికారిక సంతకాల కార్యక్రమం తర్వాత విడుదల చేసే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు. అప్పటి వరకు ఈ ఒప్పందంలోని అసలు నిబంధనలపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం ప్రపంచ దృష్టంతా అమెరికా-ఇరాన్ చర్చల తదుపరి పరిణామాలపైనే ఉంది.