Site icon NTV Telugu

Ukraine Russia War: రష్యాపై మరిన్ని ఆంక్షలు..

ఉక్రెయిన్‌ రాజధానికి అడ్డుగోడగా నిలిచిన బుచా సిటీని సర్వనాశనం చేసింది రష్యా. వందలాది మందిని ఊచకోత కోసింది. ఈ ఘటన ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ప్రపంచ దేశాలు రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధ నేరాలకు పాల్పడుతున్న పుతిన్‌ దర్యాప్తును ఎదుర్కోవాల్సిందే అని హెచ్చరిస్తున్నాయి. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు అమెరికా, యూరప్ సిద్ధమయ్యాయి. బుచా ఘటనలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశమైంది. ఐక్యరాజ్యసమితిలో బుచా మరణాలపై స్వతంత్ర దర్యాప్తునకు భారత్‌ కూడా మద్దతు తెలిపింది. బుచా నగ‌రంలో మార‌ణ‌హోమాన్ని భార‌త్ తీవ్రంగా ఖండిస్తుంద‌ని తెలిపారు విదేశాంగమంత్రి జైశంకర్‌. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత జెలెన్‌స్కీ తొలిసారిగా భద్రతా మండలి సమావేశంలో వర్చువల్‌గా మాట్లాడారు.

Read Also: Hyderabad Old City: ఇక్కడ ఇలాగే ఉంటుంది.. మరో ఎంఐఎం కార్పొరేటర్‌ హంగామా..

బుచా నగరంలో రష్యా సేనలు మారణహోమానికి పాల్పడ్డాయని.. వందలాది మందిని ఉద్దేశపూర్వకంగా చంపేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ దేశంపై రష్యా సాగించిన దురాగతాలను నియంత్రించడంలో ఐక్యరాజ్యసమితి ఘోరంగా విఫలమైందన్నారు. తక్షణమే స్పందించి రష్యాను శిక్షించాలని.. అది చేయలేకుంటే ఐక్యరాజ్యసమితిని రద్దు చేసుకోవాలన్నారు జెలెన్‌స్కీ. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదని.. అది నెలలపాటు లేదంటే సంవత్సరాల పాటు జరగొచ్చని అన్నారు నాటో చీఫ్. ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని కీలక నగరాలను నేలమట్టం చేసిన రష్యా సైన్యం.. మరిన్ని నగరాల్లో విధ్వంసాన్ని ప్రారంభించింది. ఉక్రెయిన్‌ బలగాలు కూడా వెన్నుచూపకుండా రష్యా సైన్యంపై ధీటుగా విరుచుకుపడుతున్నాయి. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో దయనీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆహారం, నీళ్లు లేక జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. సరిహద్దు దేశాలకు వలసలు మరింత పెరిగాయి.

Exit mobile version