Rishi Sunak: యూకేలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ నేపథ్యంలో జూన్ నెలలో సార్వత్రిక ఎన్నిక కోసం ఒత్తిడి తెచ్చేందుకు ప్రధాని రిషి సునాక్ ప్రభుత్వంపై బ్రిటన్‌లోని లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని సమర్పించనున్నట్లు ఆ పార్టీ సోమవారం తెలిపింది. గత వారం జరిగిన స్థానిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ 474 స్థానిక కౌన్సిల్ స్థానాలను కోల్పోయింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న లేబర్ పార్టీ 186 స్థానాలు లాభపడగా.. లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ 104 మేర తమ స్థానాలను విస్తరించింది.
Read Also: China: చైనాలో మళ్లీ మహమ్మారి వ్యాప్తి చెందుతుందా..? ఆసుపత్రుల్లో ఐసీయూ పడకలను పెంచాలని సిఫార్సు
ఈ ఫలితాల ఆధారాల ఫలితంగా రిషి సునాక్ జాతీయ ఎన్నికలకు పిలుపునివ్వాలని ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎన్నికలకు పిలుపునివ్వాలని భావిస్తున్నట్లు గతంలో ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే యూకే పార్లమెంట్‌లో దిగువసభలో అధికార కన్జర్వేటివ్ పార్టీకి మెజారిటీ ఉంది. దీంతో ఒక వేళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా కూడా అది విజయం సాధించే పరిస్థితి లేదు. ఈ స్థానిక ఎన్నికలు దేశంలో రిషి సునాక్, అతని ప్రభుత్వానికి తక్కువ మద్దతు ఉన్నట్లు చూపించాయని, మంగళవారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు లిబరల్ డెమొక్రాటిక్ నాయకుడు ఎడ్ డేవీ ఒక ప్రకటనలో తెలియజేశారు.
ప్రస్తుతం ప్రభుత్వం ఈ మోషన్‌ని చర్చించేందుకు అనుమతించే అవకాశం లేదు. సాధారణంగా అవిశ్వాస తీర్మానం నెగ్గితే, అధికార పక్షం రాజీనామా చేయడంతో పాటు ఎన్నికలకు పిలుపునివ్వవచ్చు. చివరిసారిగా 1979లో అవిశ్వాస తీర్మానం ద్వారా బలవంతంగా ఎన్నికలు జరిగాయి, అప్పటి లేబర్ ప్రధాన మంత్రి జిమ్ కల్లాఘన్ పార్లమెంట్‌లో ఓటింగ్‌లో ఓడిపోయాడు. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి.