ఉక్రెయిన్‌లో రష్యా నెలల తరబడి యుద్ధం సాగిస్తున్న వేళ… గురువారం కీలక పరిణామం చోటుచేసుకొంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి, రొమేనియా అధ్యక్షుడు క్లాస్ ఐహానిస్‌లు రైలులో రాజధాని కీవ్‌కు వచ్చారు. ఉక్రెయిన్‌కు బాసటగా నిలుస్తామని ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, రొమేనియా అధినేతలు మరోసారి స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ వెంటే ఉంటామని ఉద్ఘాటించారు.
వారు గురువారం అనూహ్యంగా ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఈయూలో చేరాలన్న ఉక్రెయిన్ ఆకాంక్షకు మద్దతిస్తున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ ఉజ్వల భవిష్యత్తు కోసం తాము చేయాల్సిందంతా చేస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ హామీ ఇచ్చారు. యుద్ధ బాధిత శివారు పట్టణం ఇర్పిన్‌కు చేరుకుని, వీధివీధినా కలియతిరిగారు. పుతిన్ సేనల దాడులకు ధ్వంసమైన భవనాలను, వాహనాలను, ఛిన్నాభిన్నమైన పరిసరాలను, శిథిల వీధులను చూసి వారంతా నోళ్లు వెళ్లబెట్టారు.
బాంబులు, తూటాల ధాటికి ప్రాణాలు కోల్పోయిన వందల మంది అమాయక పౌరులను పాతిపెట్టిన సామూహిక సమాధులను పరిశీలించారు. రష్యా యుద్ధ నేరాలకు పాల్పడిన సంకేతాలు విస్పష్టంగా కనిపిస్తున్నాయని, భారీ మారణహోమం చోటుచేసుకుందని మెక్రాన్ వ్యాఖ్యానించారు. రష్యా అనాగరికంగా వ్యవహరించిందన్నారు. శత్రువులను ఎదుర్కోవడంలో ఉక్రెయిన్ ప్రజలు ధైర్యసాహసాలు కనబరచడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు. భయంకరమైన విధ్వంసం, ఊహకందని మారణహోమం చోటుచేసుకున్నాయని, రష్యా క్రూర దాడికి పాల్పడిందని ఐహానిస్‌లు పేర్కొన్నారు. ఉక్రెయిన్ పరిస్థితులు రాన్రాను మరింత కష్టతరంగా ఉంటాయని… దేశ ప్రజలకు తాము ఎల్లప్పుడూ బాసటగా నిలుస్తామని నేతలు హామీ ఇచ్చారు. అధ్యక్షుడు జెలెన్‌స్కీతోనూ నేతలు భేటీ అయ్యారు. వారి పర్యటనతో నైతిక స్థైర్యం పెరిగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు.
తమకు ఆయుధాలు ఇవ్వాలని, ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ అభ్యర్థిత్వ హోదా మంజూరయ్యేలా సహకరించాలని జెలెన్‌స్కీ వారికి విజ్ఞప్తి చేశారు. నేతలు అందుకు హామీ ఇచ్చారు. పశ్చిమ, యూరోపియన్ దేశాలు పుతిన్‌తో సంప్రదింపుల పేరిట కాలయాపన చేస్తూ… ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇచ్చే విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శల నేపథ్యంలో- ఐరోపా నేతల పర్యటన ప్రాధాన్యం సంతరించుకొంది. ఉక్రెయిన్‌కు ఈయూ అభ్యర్థిత్వ హోదా ఇచ్చే విషయమై ఐరోపా కమిషన్ త్వరలో నిర్ణయం వెలువరించడానికి ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
https://ntvtelugu.com/international-news/stop-adani-protest-strats-in-srilanka-182061.html
డాన్‌బాస్‌లోని సెవెరోడొనెట్స్‌క్ సిటీ వద్ద భీకర పోరు సాగుతోంది. నగరాన్ని 90 శాతం రష్యా సేనలు ఆక్రమించాయి. అజోట్ కెమికల్ ప్లాంట్‌లో 500 మంది పౌరులు, ఉక్రెయిన్ సైనికులు తలదాచుకుంటున్నారు. ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల నుంచి అందుతున్న ఆయుధాలు, సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని రష్యా సైన్యం దాడులు సాగిస్తోంది. మరోవైపు పశ్చిమ లెవివ్‌లో జొలోచివ్ శివారులో నాటో దేశాలు సరఫరా చేసిన ఆయుధాల డిపోను లాంగ్–రేంజ్ క్షిపణులతో ధ్వంసం చేశామని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనాషెంకోవ్ ప్రకటించారు.
ఉక్రెయిన్‌కు సైనిక సాయం విషయంలో రష్యా హెచ్చరికలను నాటో దేశాలు లెక్కచేయడం లేదు. మరిన్ని లాంగ్–రేంజ్ ఆయుధాలు అందజేస్తామని తాజాగా ప్రకటించాయి. అదనంగా బిలియన్ డాలర్ల సైనిక సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అదనపు సాయానికి జర్మనీ కూడా అంగీకారం తెలిపింది. యుద్ధ రంగంలో తమ సేనలు వీరోచితంగా పోరాడుతున్నాయని జెలెన్‌స్కీ ప్రశంసించారు. 112 రోజులుగా సాగుతున్న యుద్ధంలో శక్తిసామర్థ్యాలను నిరూపించుకుంటున్నాయని చెప్పారు.
