ఉక్రెయిన్‌పై సరిగ్గా నెల కిందట యుద్ధాన్ని ప్రారంభించింది రష్యా. ఫిబ్రవరి 24న రష్యా బలగాలు క్రిమియా సరిహద్దులు దాటి ఉక్రెయిన్‌లోకి వెళ్లాయి. అప్పుడు మొదలైన దాడులు నేటికీ రేయింబవళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా దాడులతో ఉక్రెయిన్ నామరూపాల్లేకుండా పోయింది. కొన్ని నగరాలు పూర్తిగా నిర్మానుష్యం అయిపోయాయి. 35 లక్షల మంది ఉక్రెయిన్ వీడి పొరుగు దేశాలు వలసపోయారు. అత్యధికంగా పోలాండ్‌లో 20 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ దాటి వెళ్లడానికి చూడా ఆస్కారం లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడికక్కడ రోడ్లు, బ్రిడ్జిల్ని పేల్చేశాయి రష్యా బలగాలు. జనావాసాలపైనా బాంబులు వర్షం కురిపిస్తోంది రష్యా. ఆరంభంలో రాజధాని కీవ్‌తో పాటు పెద్ద నగరాలు లక్ష్యంగా రష్యా దాడులు జరిగాయి. అయితే, ఉక్రెయిన్ దళాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవ్వడంతో వ్యూహం మార్చింది రష్యా. మేరియుపోల్ వంటి నగరాలపై దాడులు చేస్తున్నాయి రష్యా బలగాలు. ఇప్పుడే మేరియుపోల్ నగరం 90 శాతం నాశనమైపోయింది. సుమారు లక్ష మంది సామాన్యులు అక్కడ చిక్కుపోయారు. వాళ్లక్కడి నుంచి బయటపడే మార్గం లేదు. వాళ్లకు ఆహారం, మంచినీరు, ఔషదాలు అందడం లేదు.
Read Also: Telangana Vs Centre: ధాన్యం సేకరణపై కొలిక్కిరాని పంచాయితీ
బలగాల పరంగా గాని, ఆయుధాల పరంగా గాని… రష్యా-ఉక్రెయిన్ల మధ్య ఏమాత్రం పోలిక లేదు. కానీ… రష్యా నెల రోజుల యుద్ధంలో విధ్వంసం సృష్టించడం మినహా సాధించింది ఏమీ లేదు. ఇప్పటికీ కీలక నగరాలు ఉక్రెయిన్ ఆధీనంలోనే ఉన్నాయి. రాజధాని కీవ్ సహా పెద్ద నగరాలపై పట్టు సాధించలేకపోతున్నాయి రష్యా బలగాలు. వీధి పోరాటాల్లో చావుదెబ్బతింటున్నాయి. ఆరంభంలో రష్యా దళాలపై కాక్‌టైల్ బాంబులు వేసి దెబ్బతీశారు ఉక్రెయిన్ సౌరులు. ఇప్పుడు అటువంటి దాడులు ఆగిపోయాయి. ఉక్రెయిన్ సొంతంగా తయారు చేసుకున్న స్టగ్‌నా-P యాంటీ ట్యాంక్ మిస్సైళ్లు రష్యాను నిలువరించడంలో సమర్థవంతంగా పని చేస్తున్నాయి. వీటికి ఇతర దేశాల నుంచి అందుతున్న జావలిన్, స్ట్రింగర్ మిస్సైళ్లతో ఉక్రెయిన్ దళాలు దాడులు చేస్తున్నాయి. రష్యా ట్యాంకులు, రాకెట్ లాంచర్లతో పాటు బలగాలను తరలించే ఆర్మర్డ్ వాహనాలను పేల్చేస్తున్నాయి. దీంతో రష్యా వైపు నష్టం అధికంగా ఉంటోంది. తమ దేశంలోకి ప్రవేశించిన రష్యా సైనికుల్లో 15 వేల మంది మట్టుబెట్టినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. అయితే, నాటో అంచనాల ప్రకారం 7 వేలకు పైగా రష్యా సైనికులు చనిపోయినట్టు తెలుస్తోంది. కానీ… తమ సైనికుల మరణాల గురించి ప్రకటించడం లేదు. తమపై రష్యా దాడులను నిరసిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. తద్వారా అంతర్జాతీయ సమాజం తమకు మద్దతుగా నిలిచి… రష్యాపై ఒత్తిడి తేవాలన్నారాయన. పశ్చిమ దేశాల తీరుపై ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాల్లో అసంహనం వ్యక్తమౌతోంది. ఇప్పటికీ యూరప్‌లోని పలు దేశాలకు రష్యా నుంచి 90 శాతానికి పైగా ముడి చమురు, గ్యాస్ సరఫరా జరుగుతోంది. స్విఫ్ట్ నుంచి పలు దేశాలు రష్యాను బహిష్కరించినా… ఇప్పటికీ రష్యా బ్యాంకులకు చెల్లింపులు జరుపుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు… ఉక్రెయిన్ బలగాలకు ఆశించిన స్థాయిలో ఆయుధాలు, మందుగుండు అండదం లేదంటున్నాయి ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు. నెల రోజుల యుద్ధంలో ఉక్రెయిన్‌పై పట్టు సాధించలేకపోవడంతో మరింత శక్తివంతమైన ఆయుధాలను రంగంలోకి దించుతోంది రష్యా. అటు చర్చలపైనా ప్రతిష్టంభణ కొనసాగుతోంది. దీంతో ఇప్పట్లో యుద్ధం ఆగే సూచనలు కనిపించడం లేదు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం ప్రకారం, ఉక్రెయిన్‌లో నెల రోజుల రష్యా దాడి కారణంగా మరణించిన పౌరుల సంఖ్య 1,000 దాటింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై దాడి చేయడం ద్వారా “పెద్ద తప్పు” చేశారని నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఆరోపించారు, కూటమి యొక్క తూర్పు రక్షణను సరిదిద్దడం గురించి చర్చించడానికి నాయకులు సమావేశమయ్యారు.