బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ చైనాలో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల పర్యటన కోసం డ్రాగన్ దేశానికి వచ్చారు. పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిసి పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఒక పాశ్చాత్య నాయకుడు ఎనిమిది సంవత్సరాల తర్వాత చైనాను సందర్శించిన మొదటి బ్రిటిష్ ప్రధాన మంత్రి స్టార్మర్ కావడం విశేషం.
గత నాలుగేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో రష్యాకు చైనా మద్దతు తెలిపింది. ఉక్రెయిన్‌కు యూరోపియన్ దేశాలు మద్దతు తెలిపాయి. ఇలాంటి తరుణంలో ఐరోపాకు చెందిన బ్రిటన్ ప్రధాని స్టార్మర్ చైనాలో పర్యటించడం ఆసక్తి రేపుతోంది. దీనికి ట్రంప్ బెదిరింపులే కారణంగా తెలుస్తోంది. ఈ మధ్య గ్రీన్‌లాండ్ స్వాధీనం కోసం ఈయూ దేశాలను ట్రంప్ బెదిరిస్తున్నారు. దీంతో యూరోపియన్ దేశాలు మెల్లగా చైనాకు దగ్గర అవుతున్నట్లుగా కనిపిస్తోంది. స్టార్మర్ పర్యటనకు ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ పర్యటించారు. ఇక భారతదేశంతో ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ఈ పరిణామాలను బట్టి చూస్తే.. అమెరికాకు మిత్ర దేశాలు దూరం అవుతున్నట్లుగా అర్థమవుతోంది.
ఇక గురువారం జిన్‌పింగ్-స్టార్మర్ దీర్ఘకాలిక, స్థిరమైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అంగీకరించాయి. అంతేకాకుండా రెండు దేశాలు 10 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో ట్రాన్స్‌నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్, అక్రమ వలసలపై సహకారం, ద్వైపాక్షిక సేవల భాగస్వామ్యం ఏర్పాటు, యూకే నుంచి చైనాకు ఎగుమతులు, ఆరోగ్య సహకారం, జంతువులు, మొక్కల నిర్బంధం ఉన్నాయి.
చైనా-బ్రిటన్ సంబంధాలు, సహకారం ప్రజలకు.. ప్రపంచానికి మెరుగైన ప్రయోజనం చేకూరుస్తుందని జిన్‌పింగ్ అన్నారు. ఇక బ్రిటిష్ ప్రజలకు ఏకపక్ష వీసా మినహాయింపును మంజూరు చేయడాన్ని బీజింగ్ చురుకుగా పరిశీలిస్తోందని స్టార్మర్‌కు తెలియజేశారు. అభివృద్ధి, భద్రతను ప్రోత్సహించుకోవడానికి రెండు దేశాల మధ్య సమతుల్య సంబంధాన్ని కోరుకుంటున్నట్లుగా చెప్పారు. చైనా ప్రపంచ వేదికపై కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. విభేదాలు ఉన్నప్పటికీ సమస్యలు చర్చించడం చాలా అవసరం అని పేర్కొన్నారు. బ్రిటన్‌తో దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి చైనా సిద్ధంగా ఉందని స్టార్మర్ వెల్లడించారు.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక మిత్రుల్ని.. శత్రువుల్ని ఒకేలా చూస్తున్నారు. పబ్లిక్ వేదికలపై ట్రంప్ విమర్శలు చేస్తున్నారు. ఆ మధ్య దావోస్‌లో ట్రంప్.. కెనడాను తీసిపడేసినట్లుగా మాట్లాడారు. అంతకముందు కెనడాను అమెరికాలో ఒక రాష్ట్రంగా మారుస్తామని వెల్లడించారు. ఇక ఈ మధ్య వెనిజులా దేశాన్ని స్వాధీనం చేసుకున్నాక.. గ్రీన్‌లాండ్‌ను కూడా స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటన ఐరోపా దేశాలకు రుచించలేదు. ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోబోనివ్వమని తేల్చి చెప్పాయి. దీంతో అప్పటి నుంచి మిత్రదేశాల మధ్య విభేదాలు తలెత్తాయి.
