H-1B visa: H-1B వీసా ఫీజును పెంచుతూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త దరఖాస్తుదారులకు లక్ష డాలర్లు(రూ. 88లక్షలు) ఫీజు విధించాడు. ముఖ్యంగా, దీని ప్రభావం భారతీయ టెక్కీలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే, మొత్తం హెచ్1బీ వీసాల్లో 70 శాతం భారతీయులే ఉన్నారు. అయితే, హెచ్1బీ వీసాల విషయంలో మరిన్ని కఠిన నిర్ణయాలు ఉంటాయని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెబుతోంది.
యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 2026 నాటికి హెచ్1బీ వీసాల ప్రక్రియలో గణనీయమైన మార్పులు ఉంటాయని చెప్పారు. కొత్త రుసుము $100,000 అమల్లోకి వస్తుందని, ‘‘చవకైన’’ టెక్ కన్సల్టెంట్లు దేశంలోకి వచ్చి వారి కుటుంబాలను తీసుకురావాలనుకునే ఆలోచన తప్పు అని ఆయన అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ విధానం అమలులోకి వస్తుందని ఆయన చెప్పారు. హెచ్1బీ వీసాల కోసం లాటరీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందనే దానిపై ప్రశ్నలు ఉన్నప్పటికీ, ఫిబ్రవరి నాటికి అన్ని పరిష్కరించబడుతాయని ఆయన అన్నారు. ‘‘అమెరికాలోకి వచ్చే నైపుణ్యం ఉన్న వర్కర్ల కోసం లాటరీ నిర్వహించడం వింతగా ఉంది’’ అని ఆయన అన్నారు.
Read Also: Girl Killed Boyfriend: గర్భవతి అయిన ప్రియురాలు.. ప్రియుడిని దారుణంగా హత్య.. ఎందుకంటే?
అత్యంత నైపుణ్యం ఉన్న వర్కర్లకు మాత్రమే హెచ్1బీ వీసా ప్రాధన్యత ఇస్తుందని చెప్పారు. ఉన్నత డిగ్రీలు కలిగిన వైద్యులు, విద్యావేత్తలు అమెరికాకు రావాలని, ఒక వేళ కంపెనీలు ఇంజనీర్లను నియమించుకోవాలంటే వారు అధిక జీతం పొందే వారిని మాత్రమే నియమించుకోవాలని లుట్నిక్ చెప్పారు. చవకైన టెక్ కన్సల్టెంట్లను పొందాలనుకునే ఆలోచనను తొలగించుకోవాలని టెక్ కంపెనీలకు సూచించారు.
ఈ నెలలో యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ ‘‘ప్రాజెక్ట్ ఫైర్‌వాల్’’ని రూపొందించింది. ఇది అత్యంత నైపుణ్యం కలిగిన అమెరికా వర్కర్ల హక్కులు, వేతనాలను, ఉద్యోగావకాశాలను కాపాడటమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్ట్ ఫైర్‌వాల్ ప్రారంభించడం వల్ల అమెరికన్ ఉద్యోగుల అవకాశాలనున దెబ్బతీయకుండా, హెచ్1బీ వీసాలు దుర్వినియోగం కాకుండా ఉంటుందని అమెరికా కార్మిక కార్యదర్శి లోరీ చాపెజ్ డిరెమెర్ ఒక ప్రకటనలో తెలిపారు.
