Site icon NTV Telugu

Jerusalem Blasts: జంట పేలుళ్లతో వణికిన ఇజ్రాయిల్.. జెరూసలేంపై మిలిటెంట్ల దాడి..

Israel Attacks

Israel Attacks

Twin blasts at bus stops shake Jerusalem, over 15 injured: ఇజ్రాయిల్ జంట పేలుళ్లతో వణికింది. జెరూసలేంలోని బస్ స్టాపులే టార్గెట్గా వరసగా రెండు పేలుళ్లు జరిగాాయి. నగరం శివారులో ఉన్న బస్ స్టాండ్ లో బుధవారం ఈ ఘటన జరిగింది. ఇప్పటి వరకు ఈ పేలుళ్లలో 15 మంది గాయపడినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. పాలస్తీనా మిలిటెంట్లు ఈ దాడి చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో అత్యవసర సేవలను మోహరించారు. సిటీ వెస్ట్రన్ ఎగ్జిట్ సమీపంలోని బస్ స్టేషన్ లో మొదటి పేలుడు సంభవించగా.. రెండవది నగరానికి తూర్పున ఉన్న బస్ స్టేషన్ లో జరిగింది. దాదాపుగా 30 నిమిషాల వ్యవధిలో ఈ రెండు పేలుళ్లు చోటు చేసుకున్నాయి.

Read Also: Orion Spacecraft: చంద్రుడికి చేరువలో ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్..

వెస్ట్రన్ ఎగ్జిట్ వద్ద జరిగిన పేలుడులో మొత్తం 12 మంది గాయపడగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందులో ఒకరు మరణించారు. మరో చోట జరిగిన పేలుడులో బస్సు దెబ్బతింది, ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. సాక్ష్యాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. అనుమానిత ప్రాంతాలను తనిఖీ చేస్తున్నారు. ఘటనపై రక్షణ మంత్రి బెన్నీ గాంట్జ్ షిన్ బెట్, అంతర్గత భద్రతాధికారులతో సమావేశం అయ్యారు. వీటిని తీవ్రవాద దాడులుగా అక్కడి మంత్రులు అభివర్ణిస్తున్నారు.

ఇజ్రాయిల్, పాలస్తీనా వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో పాలస్తీనా మిలిటెంట్లు తరుచుగా ఇజ్రాయిల్ పై దాడులు చేస్తున్నారు. దీంతో ఇజ్రాయిల్ ఆర్మీ గాజా స్ట్రీప్ లో ఇస్లామిక్ ఉగ్రవాదుల స్థావరాలను రాకెట్లతో ధ్వంసం చేస్తోంది. 2000 నుంచి ఈ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ప్రస్తుతం గాజా స్ట్రీప్ హమాస్ ఉగ్రవాదుల చేతిలో ఉంది. తాజాగా పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ప్రతినిధి బాంబు దాడులను ప్రశంసించారు. అయితే వీటికి మాత్రం బాధ్యత వహించలేదు. ఇక జెరూసలెం విషయానికి వస్తే ఇక్కడి టెంపుల్ మౌంట్ ప్రాంతంలో తరుచుగా యూదులు, ముస్లింలకు మధ్య ఘర్షణ ఏర్పడుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని జెంజమిన్ నెతన్యాహు మళ్లీ గెలుపొందారు. ప్రస్తుతం ఈయన తన మద్దతుదారులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో ఉన్న క్రమంలోనే ఈ దాడులు చోటు చేసుకున్నాయి.

Exit mobile version