అమెరికా-కెనడా మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొనేలా ఉన్నాయి. ట్రంప్ వ్యాఖ్యలతో పరిస్థితులు తారుమారు అయినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ‘బోర్డ్ ఆఫ్ పీస్’’పై కెనడాకు పంపిన ఆహ్వానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఏదో తేడా కొడుతున్నట్లుగా అనిపిస్తోంది. మరోసారి రెండు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొన్నట్లుగా కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: US: అమానుషం.. 5 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
గురువారం దావోస్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. కెనడా అమెరికా వల్లే జీవిస్తోందని.. కనీసం కృతజ్ఞత లేదని వ్యాఖ్యానించారు. అయితే దావోస్‌లో ఉన్న కెనడా ప్రధాని మార్క్ కార్నీ.. ట్రంప్ వాదనను తప్పికొట్టారు. కెనడా అమెరికా వల్ల బ్రతకడం లేదని.. కెనడియన్లం కాబట్టి కెనడా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇక అమెరికా నేతృత్వంలోని ప్రపంచ క్రమంలో ‘చీలిక’ జరుగుతోందని మార్క్ కార్నీ వ్యాఖ్యానించారు.
కార్నీ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా హైలెట్‌గా నిలిచాయి. ఈ వ్యాఖ్యలపైనే ట్రంప్ గుర్రుగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రపంచ సంఘర్షణను పరిష్కరించడానికి తాను ఏర్పాటు చేసుకున్న బిలియన్ డాలర్ల సంస్థ ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’లో చేరమని కెనడాకు ఇచ్చిన ఆహ్వానాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ట్రంప్ ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు.
అయితే ట్రంప్ ఆహ్వానాన్ని కార్నీ స్వాగతించారు. బోర్డులో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే ట్రంప్ ఆహ్వానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దీంతో మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో కెనడాను అమెరికాలో ఒక రాష్ట్రంగా చేస్తానని ట్రంప్ ప్రకటించారు. కార్నీ ప్రధాని అయ్యాక ఉద్రిక్తతలు సద్దుమణిగాయి. మళ్లీ ఇప్పుడు పరిస్థితి మారింది.
ఇది కూడా చదవండి: Hum Mein Shahenshah Kaun: 1989లోనే షూట్ కంప్లీట్.. 37 ఏళ్ల తర్వాత తెరపైకి రజినీకాంత్ సినిమా!
