Site icon NTV Telugu

Trump-Iran: ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా ప్లాన్ మిస్‌ఫైర్! కారణమిదేనా?

Trump1

Trump1

‘‘అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్ట.’’ ఇది టాలీవుడ్ సినిమాలోని ఒక పాత పాట. అచ్చం ఇప్పుడు అదే మాదిరిగా అయింది పశ్చిమాసియా యుద్ధం తీరు. ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన యుద్ధం గురి తప్పిందా? ప్లాన్ మిస్‌ఫైర్ అయిందా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.

ఈ ఏడాది ప్రారంభం నుంచి ట్రంప్ చాలా దూకుడిగా వెళ్తున్నారు. వెనిజులా అధ్యక్షుడు మదురోను అమెరికా కిడ్నాప్ చేసి సక్సెస్ అయింది. అనంతరం ఇరాన్‌పై ట్రంప్ ఫోకస్ పెట్టారు. ఇరాన్‌ను కూడా దారికి తెచ్చుకోవాలని స్కెచ్ వేశారు. అన్నంత తడువుగా అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలను టెహ్రాన్ చుట్టూ మోహరింపజేశారు. మొత్తానికి ఫిబ్రవరి 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై దాడి చేసి సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని అంతమొందించాయి. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులతో చెలరేగిపోయింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఊహించని రీతిలో విరుచుకుపడింది. దీంతో ప్రపంచ దేశాలను చమురు, గ్యాస్ సంక్షోభంలోకి నెట్టింది. ఈ పరిణామం ట్రంప్, ఆయన సలహాదారులకు భారీ షాక్ తగిలినట్లుగా న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.

గతేడాది ఇరాన్‌పై ఒక వారం రోజులకుపైగా పాటు అమెరికా, ఇజ్రాయెల్ చేసిన యుద్ధంలో అంతగా ఇరాన్ నుంచి రియాక్షన్ కనిపించలేదు. కానీ ఈసారి మాత్రం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చాక ప్రతీకారేచ్ఛతో రగిలిపోయింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేసింది. దీంతో చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. హార్ముజ్ జలసంధిలో అయితే వేలాది చమురు ట్యాంకర్లు నిలిచిపోయాయి. దీంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ప్రస్తుతం చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంక్షోభం తలెత్తి ధరలు పెరిగిపోయాయి. చాలా చోట్ల దొరకడం కూడా కష్టంగా మారింది.

అయితే ట్రంప్, అతని సలహాదారులు వేసిన వ్యూహాత్మక లెక్కలు ఫెయిల్యూర్ అయినట్లుగా న్యూయార్క్ టైమ్స్ తన నివేదికలో తెలిపింది. అంచనాలు తల్లకిందలైనట్లుగా పేర్కొంది. ఇరాన్ ప్రతీకార దాడులతో ఈ స్థాయిలో ఇంధన మార్కెట్‌పై ప్రభావం చూపిస్తుందని ట్రంప్, పెంటగాన్ అంచనా వేయలేకపోయిందని స్పష్టం చేసింది. చమురు, గ్యాస్ సరఫరాలపై తక్కువ అంచనాలు వేయడంతోనే ఈ దుస్థితి నెలకొన్నట్లుగా వెల్లడించింది. మార్కెట్ అంతరాయాల గురించి తాను ఆందోళన చెందడం లేదని ఫిబ్రవరిలో ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్ అన్నారు. అంతేకాకుండా ఇరాన్ ప్రతీకారం తీర్చుకోగలదనే హెచ్చరికలను కొంత మంది కూడా తోసిపుచ్చినట్లుగా కథనంలో వెల్లడించింది.

హార్ముజ్ జలసంధిని సురక్షితంగా తిరిగి తెరవడానికి ట్రంప్ పరిపాలనకు స్పష్టమైన ప్రణాళిక లేదని సెనేటర్ క్రిస్ మర్ఫీ వెల్లడించారు. ఇరాన్ బలమైన ఎదురుదాడి పెంటగాన్‌ను కొంతవరకు ఆశ్చర్యపరిచిందని రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ కూడా అంగీకరించారు. యుద్ధాన్ని ముగించడానికి స్పష్టమైన వ్యూహం లేకపోవడంతో పరిపాలనలోని కొంతమంది అధికారులు ఇప్పుడు నిరాశ చెందుతున్నట్లుగా న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.

Exit mobile version