Iran and US Tensions: ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సైనిక చర్యకు సంబంధించిన హెచ్చరికలు చేసిన ట్రంప్.. ప్రస్తుతం ప్రత్యక్ష సైనిక దాడికి బదులుగా ఆర్థిక, దౌత్యపరమైన ఒత్తిడిని పెంచే వ్యూహంపై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. ఇరాన్‌లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితిని అమెరికా నిశితంగా గమనిస్తోందని ట్రంప్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక వనరుల కొరత కారణంగా టెహ్రాన్‌పై ఆర్థిక ఒత్తిడి మరింత ప్రభావం చూపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్‌తో పాక్షికంగా, గోప్యంగా చర్చలు కూడా కొనసాగుతున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
ఇరాన్ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందని, సైనికులకు జీతాలు చెల్లించేందుకు కూడా నిధుల కొరత ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా నావికా దిగ్బంధనం కూడా ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై అదనపు ఒత్తిడిని పెంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాలు కూడా భారీ సైనిక చర్యకు బదులుగా ఆర్థిక, దౌత్యపరమైన ఒత్తిడిని కొనసాగించాలని సూచించినట్లు ట్రంప్ గతంలో తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు సుమారు 75 డాలర్ల వద్ద ఉండటం కూడా అమెరికాకు కొంత వెసులుబాటు కల్పిస్తోంది. దీంతో వెంటనే మరో పెద్ద సైనిక ఘర్షణకు వెళ్లకుండా ఇరాన్‌పై ఒత్తిడి కొనసాగించే అవకాశం వాషింగ్టన్‌కు లభిస్తోంది. ఈ పరిణామాలను చదరంగం ఆటతో పోల్చిన ట్రంప్.. సమస్య చివరకు పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హార్మూజ్ ఒప్పందానికి కొత్త అడ్డంకులు
ఇదిలా ఉండగా, హార్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలను పునరుద్ధరించేందుకు అమెరికా, ఇరాన్, ఒమన్ మధ్య ప్రతిపాదిత ఒప్పందానికి కొత్త అడ్డంకులు ఎదురయ్యాయి. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధిపతి మహమ్మద్ బఘేర్ జోల్కదర్.. అమెరికా యుద్ధాన్ని పూర్తిగా ముగించాలని, నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, అమెరికా దళాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇరాన్‌పై విధించిన ఆంక్షలను ఎత్తివేయడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను తిరిగి ఇవ్వడం, యుద్ధ నష్టపరిహారం చెల్లించడం వంటి డిమాండ్లను కూడా ఆయన ముందుకు తెచ్చారు. అమెరికా ఇరాన్‌ను బెదిరించడం, అవమానించడం ఆపాలని, అలాగే ఇరాన్ ప్రాంతీయ మిత్రదేశాలపై సైనిక చర్యలను నిలిపివేయాలని కోరారు. అయితే, హార్మూజ్ జలసంధి ద్వారా ప్రయాణించే వాణిజ్య నౌకలపై ఇరాన్ ఆంక్షలు విధించడం లేదా వాటిపై సుంకాలు విధించే ప్రయత్నాన్ని అమెరికా అంగీకరించలేదు. దీంతో ప్రతిపాదిత ఒప్పందంపై ఇరుదేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
ట్రంప్‌కు హార్మూజ్‌దే ప్రధాన ప్రాధాన్యత?
ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. ఇరాన్ హార్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలను పూర్తిగా పునరుద్ధరిస్తే, కొత్త అణు ఒప్పందం కుదరకపోయినా ట్రంప్ వెనక్కి తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది గతంలో అమెరికా ప్రకటించిన వైఖరితో పోలిస్తే కీలకమైన మార్పుగా భావిస్తున్నారు. ఇప్పటివరకు ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయడం అమెరికా ప్రధాన డిమాండ్లలో ఒకటిగా ఉంది. అయితే టెహ్రాన్ అణు కార్యక్రమంపై చర్చలు సంక్లిష్టంగా మారడంతో.. హార్మూజ్ జలసంధి పునఃప్రారంభానికే ట్రంప్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వవచ్చని తెలుస్తోంది.
ఇరాన్ అణు కర్మాగారాలను ధ్వంసం చేసిన తర్వాత వాటి సామర్థ్యాలను తిరిగి నిర్మించడం టెహ్రాన్‌కు అంత సులభం కాదని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ రహస్యంగా అణు కార్యకలాపాలను పునఃప్రారంభించే ప్రయత్నం చేసినా అమెరికా నిఘా సంస్థలు గుర్తించగలవని వాషింగ్టన్ విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో సమగ్ర అణు ఒప్పందం కంటే ముందుగా హార్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావడానికే ట్రంప్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సైనిక చర్యకు బదులుగా ఆర్థిక ఒత్తిడి, దౌత్య చర్చల ద్వారా ఇరాన్‌ను ఒప్పించే ప్రయత్నం ప్రస్తుతం అమెరికా వ్యూహంలో కీలకంగా మారినట్లు తెలుస్తోంది.

