Donald Trump: ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై అమెరికా పూర్తి విజయం సాధించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కేవలం 93 శాతం విజయం సాధించి సరిపెట్టుకోబోమని, సంపూర్ణ విజయం సాధించే వరకు తమ ప్రయత్నాలు కొనసాగుతాయని వెల్లడించారు. ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా ప్రారంభించలేదని, 1979 నుంచి ఇరాన్ నే అమెరికాపై యుద్ధం చేస్తోందని ఆరోపించారు.
అర్లింగ్టన్ నేషనల్ సిమెటరీలో నిర్వహించిన 2026 నేషనల్ వెటరన్స్ డే వేడుకల్లో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా సైనిక చర్యలను సమర్థిస్తూ మాట్లాడారు. ఇరాన్ దశాబ్దాలుగా అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, ఇన్నాళ్లకు తమ ప్రభుత్వం గట్టిగా బదులిచ్చిందని పేర్కొన్నారు. “అమెరికా ఇరాన్‌తో యుద్ధాన్ని ప్రారంభించలేదు. 1979 నుంచి ఇరాన్ అమెరికాపై యుద్ధం చేస్తోంది. ఈ సమస్యకు చాలా కాలం క్రితమే పరిష్కారం చూపాల్సి ఉండేది” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరాన్‌కు గట్టిగా బదులిచ్చామని, అమెరికా సైనిక చర్యలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. అయితే పాక్షిక విజయం తమకు సరిపోదని, పూర్తి విజయం సాధించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. “మేము తిరిగి పోరాడాం. చాలా బలంగా పోరాడాం. విజయం సాధించాం. అయితే ఈ యుద్ధాన్ని పూర్తిగా ముగించాలనుకుంటున్నాం. 93 శాతం విజయం కాదు.. సంపూర్ణ విజయం సాధించాలి. అది కచ్చితంగా జరుగుతుంది” అని ట్రంప్ అన్నారు. అమెరికా ధ్వంసం చేసిన సైనిక సామర్థ్యాలను తిరిగి నిర్మించుకోవడానికి ఇరాన్‌కు 25 ఏళ్లు పడుతుందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే భవిష్యత్తులో మళ్లీ దాడులు చేయాల్సిన పరిస్థితి రాకూడదని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఇరాన్ అణు కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసుకోకుండా అమెరికా అడ్డుకుందని తెలిపారు. ఈ చర్యల్లో భాగంగా బీ-2 (B-2) స్టెల్త్ బాంబర్లను ఉపయోగించినట్లు పేర్కొన్నారు. “ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండకుండా మేము అడ్డుకున్నాం. బీ-2 బాంబర్లు వాటిని ధ్వంసం చేశాయి. ఏడు నెలల క్రితమే ఇరాన్‌పై మా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అయితే కొన్ని వారాల పాటు మాత్రమే తీవ్ర స్థాయిలో యుద్ధం జరిగింది. ఈ ఘర్షణలో మేము 18 మంది ధైర్యవంతులైన సైనికులను కోల్పోయాం” అని ట్రంప్ వెల్లడించారు.
ఇరాన్‌తో కొనసాగుతున్న ఘర్షణ త్వరలోనే ముగుస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచం మరింత సురక్షితంగా, ప్రశాంతంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ వివాదానికి ముగింపు పలికిన తర్వాత అంతర్జాతీయంగా నెలకొన్న భద్రతాపరమైన ముప్పులు తగ్గుతాయని అన్నారు. ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్యలు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇరాన్ వ్యతిరేక వైఖరికి ప్రతిస్పందన మాత్రమేనని ట్రంప్ సమర్థించుకున్నారు.
అమెరికా సైన్యం కోసం సేవలందించిన మాజీ సైనికులను గౌరవించేందుకు అర్లింగ్టన్ నేషనల్ సిమెటరీలో నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణ కోసం వివిధ తరాల్లో సేవలందించిన సైనికులకు ఆయన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, వెటరన్స్ వ్యవహారాల శాఖ కార్యదర్శి డగ్ కాలిన్స్ కూడా పాల్గొన్నారు.

