అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రతిపాదనతో వలసదారుల్లో ఆందోళన రేకెత్తించబోతున్నారు. దేశంలో పనిచేస్తున్న వలస ట్రక్ డ్రైవర్ల స్థానంలో అమెరికా మాజీ సైనికులను నియమించాలని ప్రతిపాదించారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అమెరికాలో ట్రక్కింగ్ రంగంలో పనిచేస్తున్న సుమారు 1.3 లక్షల నుంచి 1.5 లక్షల మంది భారతీయులు, ముఖ్యంగా పంజాబ్, హర్యానాకు చెందిన సిక్కు డ్రైవర్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
పెన్సిల్వేనియాలో నిర్వహించిన మిలిటరీ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికాలో అక్రమంగా వచ్చిన వలస ట్రక్ డ్రైవర్లపై తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కఠిన చర్యలు చేపడుతోందన్నారు. చాలామంది సరైన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు లేకుండానే భారీ ట్రక్కులు నడుపుతున్నారని ఆరోపించారు. ‘‘నా ప్రభుత్వం త్వరలో అక్రమ విదేశీ ట్రక్ డ్రైవర్లపై చారిత్రాత్మక చర్యలు తీసుకోబోతోంది. వారు చాలా మందిని చంపుతున్నారు. రోడ్డు సూచికలు కూడా చదవలేరు. చాలామంది మద్యం, మాదకద్రవ్యాల మత్తులో వాహనాలు నడుపుతున్నారు. అలాంటి వాళ్లు అమెరికా రోడ్లపై ఉండకూడదు.’’ అని వ్యాఖ్యానించారు. ఈ వలస డ్రైవర్ల స్థానంలో అమెరికా మాజీ సైనికులను తీసుకురానున్నట్లు తెలిపారు. ‘‘మన సైన్యంలో భారీ వాహనాలు నడిపిన ప్రతి మాజీ సైనికుడికి కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత కల్పిస్తాం. వారిని ట్రక్ డ్రైవర్లుగా తయారుచేస్తాం.’’ అని ట్రంప్ వెల్లడించారు.
గత కొన్నేళ్లుగా అమెరికాలో ట్రక్కింగ్ రంగంలో స్థానికుల కొరత ఏర్పడింది. భారీ ట్రక్కులు నడిపేందుకు అమెరికన్లు ఆసక్తి చూపకపోవడంతో వలసదారులు పెద్ద ఎత్తున ఈ రంగంలోకి వచ్చారు. మంచి వేతనాలు ఉండటంతో చట్టబద్ధంగా, అక్రమంగా అమెరికాకు చేరిన పలువురు వలసదారులు ట్రక్ డ్రైవర్లుగా ఉద్యోగాలు పొందారు. అయితే ఇటీవల అక్రమ వలసదారులపై చేపట్టిన చర్యల్లో భాగంగా దాదాపు 2 లక్షల మంది వలస ట్రక్ డ్రైవర్ల కమర్షియల్ లైసెన్సులు రద్దు చేసినట్లు అమెరికా మీడియా నివేదించింది.
భారతీయులపై తీవ్ర ప్రభావం
ట్రంప్ ప్రతిపాదన అమలైతే అమెరికాలో ట్రక్కింగ్ రంగంలో పనిచేస్తున్న భారతీయులకు పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. ముఖ్యంగా పంజాబ్, హర్యానాకు చెందిన సిక్కు వర్గానికి చెందిన 1.3 లక్షల నుంచి 1.5 లక్షల మంది ట్రక్ డ్రైవర్లు ఈ రంగంలో పనిచేస్తున్నట్లు నార్త్ అమెరికన్ పంజాబీ ట్రక్కర్స్ అసోసియేషన్ తెలిపింది. ఇప్పటికే ఇంగ్లిష్ భాషా నైపుణ్య పరీక్షలు తప్పనిసరి చేయడం, వాణిజ్య డ్రైవింగ్ లైసెన్సులపై కఠిన నిబంధనలు అమలు చేయడం వంటి నిర్ణయాలతో భారతీయ ట్రక్ డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో భారతీయ మూలాలున్న కొంతమంది ట్రక్ డ్రైవర్లు రోడ్డు ప్రమాదాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసుల్లో అరెస్టు కావడం కూడా ఈ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
2025 నవంబర్‌లో భారతీయుడు రాజిందర్ కుమార్ ఒరెగాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నూతన దంపతుల మరణానికి కారణమైన కేసులో అభియోగాలు ఎదుర్కొన్నారు. 2025 అక్టోబర్‌లో జషన్‌ప్రీత్ సింగ్ కాలిఫోర్నియాలో మాదకద్రవ్యాల మత్తులో ట్రక్ నడిపి ముగ్గురి మృతికి కారణమైన కేసులో అరెస్టయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండియానాలో ఇద్దరు భారతీయ ట్రక్ డ్రైవర్లు 300 పౌండ్లకు పైగా కొకైన్ స్మగ్లింగ్ చేస్తున్న కేసులో పట్టుబడ్డారు. ఈ ఘటనల నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం వలస ట్రక్ డ్రైవర్లపై మరింత కఠిన వైఖరి అవలంబించే అవకాశముందని, ఈ నిర్ణయం అమలుకు సమయం పట్టినా అమెరికాలోని భారతీయ ట్రక్ డ్రైవర్లు ప్రభుత్వ దృష్టిలోనే ఉండే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

