Site icon NTV Telugu

Trump: నెతన్యాహు లేకుంటే ఇజ్రాయెల్ ఉనికిలో ఉండకపోయేది.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Trump

Trump

నెతన్యాహు ప్రధానిగా లేకుంటే ఇజ్రాయెల్ ఉనికిలో ఉండేదే కాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. సోమవారం ఫ్లోరిడాలో ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కలిశారు. గాజా కాల్పుల విరమణ ప్రణాళిక తదుపరి దశకు వెళ్లే అంశంపై ట్రంప్‌తో నెతన్యాహు చర్చించారు. అయితే రెండో దశకు వెళ్లే ముందు హమాస్‌ను నిరాయుధీకరణ చేయాలని నెతన్యాహు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నెతన్యాహుపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. నెతన్యాహు యుద్ధకాల ప్రధానమంత్రిగా అభివర్ణించారు. ఆ సమయంలో అద్భుతంగా పని చేశారంటూ కితాబు ఇచ్చారు. ఇజ్రాయెల్‌ను చాలా ప్రమాదకరమైన గాయం నుంచి బయటకు తీసుకువచ్చారని.. ఒక తప్పుడు ప్రధానమంత్రి ఉండుంటే.. ఈపాటికి ఇజ్రాయెల్ అనేది ఉనికిలోనే ఉండేది కాదని తాను భావిస్తున్నట్లు తెలిపారు. పక్కనే ఉన్న నెతన్యాహు తల ఊపి నవ్వారు.

ఇక సమావేశంలో ఇరాన్ అణు కార్యక్రమంపై కూడా ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే గాజాలో ప్రభుత్వాన్ని ప్రకటించాలని.. అంతర్జాతీయ దళాలు మోహరించేలా చూడాలని ట్రంప్‌ను నెతన్యాహు కోరినట్లు సమాచారం. ఇక పర్యటనలో భాగంగా నెతన్యాహు ఫ్లోరిడాలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్‌లను కలిశారని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

Exit mobile version