Site icon NTV Telugu

Trump: ఉక్రెయిన్-రష్యా శాంతి డీల్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Trump

Trump

ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెండు దేశాల మధ్య శాంతి చర్చలకు శ్రీకారం చుట్టారు. సౌదీ అరేబియా వేదికగా చర్చలు జరిగాయి. అనంతరం అలాస్కా వేదికగా పుతిన్‌తో స్వయంగా ట్రంప్ చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించకపోవడంతో ఇటీవల ట్రంప్ 28 పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించారు. దీనిపై ఇరు దేశాలతో చర్చించేందుకు ట్రంప్ దూతలు రంగంలోకి దిగారు. తొలుత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో.. అనంతరం మాస్కోలో పుతిన్‌తో 5 గంటల పాటు చర్చలు జరిపారు. అయితే 28 పాయింట్ల ప్రాతిపాదనను జెలెన్‌స్కీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ట్రంప్‌తో మాట్లాడతానంటూ సమాధానం ఇచ్చారు. ఇక రష్యా మాత్రం పూర్తి అనుకూలతను వ్యక్తం చేసింది.

తాజాగా ఇదే అంశంపై ట్రంప్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై తీవ్ర ఆరోపణలు చేశారు. శాంతి ఒప్పందానికి జెలెన్‌స్కీ సిద్ధంగా లేరని వెల్లడించారు. రష్యా ప్రాతిపాదించిన కొన్ని డిమాండ్లను కైవ్ అంగీకరించడం లేదని పేర్కొన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపడం చాలా ఈజీ అనుకున్నాను గానీ.. తీరా చూస్తే చాలా కష్టమవుతోందని చెప్పారు. ఆశ్చర్యం ఏంటంటే జెలెన్‌స్కీ ఇప్పటి వరకు ప్రాతిపాదనే చదవకపోవడం కొంచెం తనకు నిరాశ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా మాత్రం సానుకూలంగా ఉందని.. జెలెన్‌స్కీ మాత్రం ఏ విషయమో స్పష్టంగా చెప్పడం లేదన్నారు. అనుకూలమో.. వ్యతిరేకమో ఏదొక విషయం చెప్పాలి కదా?.. కానీ జెలెన్‌స్కీ మాత్రం ఏ విషయం చెప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ ప్రజలు ఇష్టపడుతున్నా.. జెలెన్‌స్కీ మాత్రం ఇష్టం పడడం లేదని పేర్కొన్నారు.

 

 

Exit mobile version