Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్

  • అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతోన్న ఉద్రిక్తతలు
  • ‘త్వరగా స్పందించండి
  • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
Trump2

Trump2

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు 60 రోజుల గడువులోపే ముగియాలని.. ఆ తర్వాత మరిన్ని చర్చలకు అవకాశం ఉండదని ట్రంప్ స్పష్టం చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇరాన్ త్వరగా స్పందించి నిర్ణయం తీసుకోవాలని.. మధ్యవర్తుల ద్వారా సందేశం పంపినట్లు సమాచారం.

అల్ అరేబియా కథనం ప్రకారం.. 60 రోజులకు మించి కొనసాగేందుకు తాను అంగీకరించబోనని. ఇప్పటికే ఇరాన్‌కు సంబంధించిన స్తంభింపజేసిన ఆస్తుల (Frozen Assets) అంశంలో కొంత పురోగతి సాధించినప్పటికీ.. ఎంత మొత్తాన్ని విడుదల చేయాలి? ఎప్పుడు విడుదల చేయాలి? అనే అంశాలపై ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయని నివేదిక పేర్కొంది.

×
×
Ad

ట్రంప్ నిర్ణయం తీసుకోవాలి 

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సైనిక సలహాదారు మొహ్సెన్ రెజాయీ స్పందిస్తూ.. ప్రస్తుతం చర్చలు ప్రతిష్టంభనలో ఉన్నాయని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ప్రతిష్టంభనను తొలగించాలని సూచించారు. “ట్రంప్ నిజంగా ఇరాన్‌తో ఒప్పందం కోరుకుంటే.. ముందుగా స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలి. అదే అమెరికాకు పరీక్ష. ఆ దిశగా అడుగు వేస్తే చర్చలకు మార్గం సుగమమవుతుంది” అని రెజాయీ వ్యాఖ్యానించారు. అదే సమయంలో ట్రంప్-మొజ్తబా ఖమేనీ మధ్య సమావేశం జరిగే అవకాశాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు. “అలాంటి భేటీ ఇప్పుడే జరగదు. ప్రస్తుతం చర్చలు మొదటి దశలోనే ఉన్నాయి. ట్రంప్ స్వయంగా ఈ చర్చలను నిలిపివేసే పరిస్థితి తీసుకొచ్చారు” అని పేర్కొన్నారు.

ఖమేనీతో భేటీకి సిద్ధం 


ఇటీవల ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరితే మొజ్తబా ఖమేనీతో సమావేశం కావడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. “ఒప్పందం కుదిరితే ఆయనను కలవడం సాధ్యమే. అలాంటి భేటీ జరిగితే అది నాకు గౌరవంగా ఉంటుంది” అని ట్రంప్ చెప్పారు.

కాల్పుల విరమణ తర్వాత చర్చలు

ఏప్రిల్ 8న అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య 40 రోజులపాటు సాగిన యుద్ధం అనంతరం కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్చలు ప్రారంభమయ్యాయి. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు ఇరు దేశాలు పలు ప్రతిపాదనలను పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. ప్రస్తుతం శాంతి ఒప్పందానికి సంబంధించిన అవగాహన పత్రం (MoU)ను ఖరారు చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు సమాచారం.

హార్ముజ్ ఉద్రిక్తతలు

అయితే చర్చలు జరుగుతున్నప్పటికీ హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఇరాన్, అమెరికా ఇటీవల పరస్పరం కొత్త దాడులకు పాల్పడినట్లు వార్తలు రావడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఇరాన్ ఇప్పటికే హార్ముజ్ జలసంధిపై కఠిన నియంత్రణ విధించగా.. అమెరికా కూడా అక్కడ నౌకాదళ దిగ్బంధన చర్యలు చేపట్టింది. దీంతో ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశాలపై అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఒప్పందమా? మరో ఉద్రిక్తతా?

60 రోజుల గడువు ముగియబోతున్న వేళ ట్రంప్ చేసిన తాజా హెచ్చరిక అమెరికా-ఇరాన్ సంబంధాల్లో కీలక మలుపుగా మారింది. చర్చలు విజయవంతమై శాంతి ఒప్పందం కుదురుతుందా? లేక మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతాయా? అన్నది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా మారింది.