H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..

  • H-1B ఉద్యోగులకు షాకిచ్చిన ట్రంప్..
  • అమెరికన్లను తొలగించి, H-1B ఉద్యోగుల తీసుకునే కంపెనీలపై అదనపు పరిశీలన..
  • H-1B వీసాల్లో సింహభాగం భారతీయులే..
  • ట్రంప్ నిర్ణయంతో భారతీయ ఉద్యోగుల్లో టెన్షన్..
Trump H1b

Trump H1b

H-1B Visa:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి H-1B వీసా విధానంపై కఠిన వైఖరిని అవలంభిస్తున్నారు. అమెరికన్ ఉద్యోగులను తొలగించి, H-1B వీసాలకు అప్లై చేసుకునే కంపెనీల దరఖాస్తుల్ని మరింత కఠినంగా పరిశీలించాలని ఫెడరల్ ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేస్తూ ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఇదే సమయంలో ఈ తరహా వీసాలపై 1,00,000 అమెరికన్ డాలర్ల చెల్లింపు నిబంధనల్ని మరో ఏడాది పొడగించారు. ఈ నిబంధనలు 2027 సెప్టెంబర్ 1 వరకు కొనసాగుతాయి. అయితే, ఈ ఫీజుపై న్యాయపరమైన సవాళ్లు కొనసాగుతున్నాయి.

ఈ రెండు నిర్ణయాలు భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. H-1B వీసాలు పొందుతున్న విదేశాల్లో భారతీయులే అధికంగా ఉన్నారు. 2024 లెక్కల ప్రకారం.. ఈ వీసాలకు అప్లై చేసుకున్న వారిలో 71 శాతం భారతీయులదే కావడం గమనార్హం.

H-1B ఆర్డర్‌లో ఏముంది.?

ట్రంప్ కొత్త ఆదేశాల ప్రకారం.. అమెరికా విదేశాంగ శాఖ, లేబర్ డిపార్ట్మెంట్, హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖలు H-1B వీసాలపై మరింత సమన్వయంతో పనిచేయాలి. H-1B వీసాలకు దరఖాస్తు చేసుకుంటున్న కంపెనీలు గతేడాది అమెరికన్ ఉద్యోగుల్ని తొలగించిందా? లేదా? లేదంటే భవిష్యత్తులో అమెరికన్ ఉద్యోగుల్ని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నాయా? అనే దానిపై అధికారులు దృష్టిపెట్టనున్నారు.

అమెరికన్ ఉద్యోగుల్ని తొలగించి, H-1B వీసాలతో ఉద్యోగుల్ని నియమించుకుంటున్నారని, తక్కువ వేతనాలతో విదేశీ కార్మికులకు ఉద్యోగాలు ఇస్తున్నారని ట్రంప్ వాదన. కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే జీతాలు, వ్యయాలు తగ్గించుకోవడానికి H-1B వీసాలను సాధనంగా వాడుతున్నారని, వీటిని దుర్వినియోగం చేస్తున్నారని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భావిస్తోంది. అయితే, అమెరికన్ ఉద్యోగుల్ని తొలగించిన ప్రతీ కంపెనీ H-1B ఉద్యోగుల్ని నియమించుకోకుండా నిషేధం లేదు. దీంతో పాటు గతంలో దాఖలైన లేబర్ కండీషన్ అప్లికేషన్లను కూడా సమీక్షించాలని అమెరికా కార్మిక శాఖకు ఆదేశాలు అందాయి. 30 రోజుల్లో సమీక్ష ప్రారంభించాలని ఆదేశంలో పేర్కొన్నారు.

భారతీయ ఉద్యోగుల్లో టెన్షన్:

ట్రంప్ తీరు వల్ల భారతీయ ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. H-1B వీసా నియమాలు భారతీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికన్ ఉద్యోగుల్ని తొలగించిన కంపెనీలు, ఇదే స్థాయిలో H-1B ఉద్యోగులను తీసుకోవడంపై పరిశీలన మరింత కఠినం అవుతుంది. వేతనాలు, ఉద్యోగ బాధ్యతలు, విదేశీ ఉద్యోగ అర్హతలు, అమెరికన్ ఉద్యోగుల తొలగింపు వంటి వాటిపై మరిన్ని తనిఖీలు జరిగే అవకాశం ఉంది.

లక్ష డాలర్ల ఫీజు పొడగింపు..

H-1B వీసాలకు 1,00,000 డాలర్లు చెల్లించే నిబంధనల్ని ట్రంప్ మరోసారి పొడగించారు. ఇది ప్రతీ H-1B ఉద్యోగి నుంచి వసూలు చేసే మొత్తం కాదు కానీ, విదేశీ ఉద్యోగుల్ని నియమించుకునే కంపెనీలు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని మినహాయింపులు కూడా ఇందులో ఉన్నాయి. H-1B వీసాలకు స్పాన్సర్ చేసే కంపెనీ లేదా యజమాని ఈ మొత్తాన్ని చెల్లించాలి. ఇలాంటి సమయంలో కంపెనీలు భారతీయుల్ని లేదా వేరే విదేశీ ఉద్యోగుల్ని తీసుకోవాలా? లేక స్థానిక ఉద్యోగులతోనే నడిపించాలా? అనే దానిపై ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. 2025లో ఈ ఫీజు అమలులోకి వచ్చిన తర్వాత పెద్ద ఐటీ స్టాఫింగ్, ఔట్‌సోర్సింగ సంస్థల H-1B రిజిస్ట్రేషన్లు 92 శాతం తగ్గాయి.