NTV Telugu Site icon

Donald Trump: ఉక్రెయిన్ ‘‘అరుదైన లోహాల’’పై ట్రంప్ కన్ను.. అమెరికాకి పుతిన్ ఆఫర్..

Us Ukraine Mineral Deal

Us Ukraine Mineral Deal

Donald Trump: అమెరికా, ఉక్రెయిన్‌లోని ‘‘అరుదైన లోహాల’’పై కన్నేసింది. ఉక్రెయిన్ సహజ వనరుల నుంచి వచ్చే ఆదాయంలో అమెరికాకు వాటా మంజూరు చేసే ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్ స్కీ ఈ ప్రతిపాదనపై సంతకం చేయడానికి ఈ వారం లేదా వచ్చే వారు వైట్ హౌజ్‌కి రావచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇది ఇద్దరు నాయకుల మధ్య పెరుగుతున్న విభేదాలకు కేంద్రంగా మారింది.

సోమవారం వైట్‌హౌజ్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. ఒప్పందం పని జరుగుతోందని, ఇది తుది దశకు చేరుకుందని అన్నారు. అయితే, అమెరికా, ఉక్రెయిన్ అధికారులు ఒప్పందాన్ని ఖరారు చేయడంతో, రష్యా కూడా అమెరికాకు ఇలాంటి ప్రతిపాదనే చేసింది. మాస్కోతో మెరుగైన సంబంధం ద్వారా డబ్బులు సంపాదించొచ్చని చెప్పింది.

అసలు ఏంటీ ఈ ఒప్పందం:

గత సెప్టెంబర్ నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు జెలెన్ స్కీ ట్రంప్‌కి ‘విక్టరీ ప్లాన్’ని ప్రతిపాదించారు. అమెరికా, ఉక్రెయిన్‌కి సెక్యూటీని అందించాన్ని కొనసాగించడానికి, జెలెన్ స్కీ బిజినెస్ ప్లాన్ ప్రతిపాదించాడు. అయితే, గత వారం అమెరికన్లు సమర్పించిన ముసాయిదా ఒప్పందం ప్రకారం, ఉక్రెయిన్ సహజ వనరుల నుంచి 50 శాతం ఆదాయం కోరినట్లు తెలిసింది, అయితే దీనికి బదులుగా భద్రతా హామీలను అందించలేదు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దీనిని గత అమెరికన్ సైనిక, ఆర్థిక సహాయానికి బదులుగా అభివర్ణించారు. భద్రతా హామీలు లేకుండా, భవిష్యత్ తరాలకు భారీ ఆర్థిక భారాన్ని సృష్టిస్తుందని జెలెన్ స్కీ ట్రంప్ ప్రతిపాదనపై సంతకం చేయడానికి నిరాకరించారు.

అప్పటి నుంచి అమెరికా, ఉక్రెయిన్ దౌత్యవేత్తలు రాజీ కోసం చర్చలు జరుపుతున్నారు. సోమవారం ఉక్రెయిన్ ఉప ప్రధాని ఓల్హా స్టెఫానిషియా ఎక్స్‌లో ‘‘ ఖనిజ ఒప్పందానికి సంబంధించి ఉక్రెయిన్, యూఎస్ చర్చలు చివరి దశలో ఉన్నాయి’’ అని పోస్ట్ చేశారు. మునుపటి ఒప్పందంతో పోలిస్తే, తాజాగా ఒప్పందం ముసాయిదా ఉక్రెయిన్‌కరి కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ, ఇందులో అమెరికా నుంచి భద్రతా పరమైన హామీ లేదని ది న్యూయార్క్ టైమ్స్ నివేదిక తెలిపింది. జెలెన్స్ స్కీ మాత్రం రష్యా దాడులను ఎదుర్కొవడానికి భవిష్యత్తులో వెస్ట్రన్ దేశాలు ఆయుధాలు, మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

రంగంలోకి పుతిన్:

సోమవారం రష్యన్ ప్రభుత్వ టెలివిజన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. అమెరికన్ కంపెనీలు రష్యాలో లాభదాయకమైన వ్యాపార ఒప్పందాన్ని చేసుకోవచ్చని అన్నారు. మాస్కోతో మెరుగైన సంబంధం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి నేరుగా సందేశం ఇచ్చారు. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌లో అరుదైన ఖనిజాల తవ్వకాలకు అమెరికన్లకు సాయం చేయగలమని పుతిన్ చెప్పారు. రష్యా వద్ద ఉక్రెయిన్ కన్నా రేర్ ఎర్త్ మెటల్స్ చాలా ఉన్నాయని, ఈ నిక్షేపాల వెలికితీతలో అమెరికన్లతో సహా మా విదేశీ భాగస్వాములతో కలిసి పని చేయడానికి పుతిన్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

రష్యా, ఉక్రెయిన్లలో సహజ నిల్వలు:

ఉక్రెయిన్ అంచనా ప్రకారం, వారి దేశంలో ‘‘క్లిష్టమైన ముడి పదార్థాలు’’లో దాదాపుగా 5 శాతం ఉక్రెయిన్‌లో ఉన్నాయి. ఇందులో దాదాపుగా 19 మిలియన్ టన్నుల గ్రాఫైట్ నిల్వలు ఉన్నాయి. ఈ ఖనిజం ప్రపంచంలోనే ఎక్కువ నిల్వలు కలిగిన దేశంగా మొదటి ఐదు దేశాల్లో ఉక్రెయిన్‌ని నిలుపుతుంది.

ఉక్రెయిన్‌లో మొత్తం యూరోప్‌లో ఉన్న లిథియం నిక్షేపాల్లో మూడింటి ఒక వంతు కూడా ఉందని నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ టైటానియంలో 7 శాతం వాటాని ఉక్రెయిన్ కలిగి ఉంది. ఆధునిక ప్రపంచంలో కీలకమైన ఆయుధాలు, విండ్ టర్బైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇతర ఉత్పత్తుల ఉత్పత్తికి అవసరమయ్యే 17 మూలకాలు ఉక్రెయిన్‌లో ఉన్నాయి.

అయితే, ఈ ఖనిజ నిక్షేపాల్లో కొన్నింటిని రష్యా స్వాధీనం చేసుకుంది. రేర్ ఎర్త్ మెటల్స్ నిల్వల్లో ప్రపంచంలోనే రష్యా అగ్రగామిగా ఉంది. దీంట్లో అమెరికా ఆసక్తి ఏంటంటే, ప్రపంచంలోనే అరుదైన లోహాల్లో 75 శాతాన్ని చైనా కంట్రోల్ చేస్తుంది. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు అమెరికా ఉక్రెయిన్‌తో ఖనిజ ఒప్పందాన్ని ఉపయోగించుకుంటుందని సమాచారం. గతేడాది కొన్ని ఖనిజాల ఎగుమతిని అమెరికాకు చైనా పరిమితం చేసింది. కొన్నింటిని నిషేధించింది.