Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!

Donald Trump

Donald Trump

Donald Trump: ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న హింసాత్మక ఆందోళనలు, దహనాలు, లూటీలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. దేశంలో నెలకొన్న అశాంతికి ‘‘వలసదారులే’’ కారణమని వ్యాఖ్యానించారు. భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తల మనసుల్లో ద్వేషం ఉందని ఆరోపించారు. ఫ్రాన్స్ తన సరిహద్దుల్ని మూసేసి, పరిస్థితుల్ని అదుపులోకి తీసుకురావాలని సూచించారు.

‘‘ఫ్రాన్స్ మండిపోతోంది, పూర్తిగా భిన్నమైన ప్రపంచం నుంచి వచ్చిన వ్యక్తుల వలసలు, వారి మనసుల్లో ద్వేషం, గొప్పగా ఉన్న ఫ్రాన్స్‌ను ఛిన్నాభిన్నం చేశాయి. ఆలస్యం కాకముందే సరిహద్దుల్ని మూసేసి, పరిస్థితిని మీ నియంత్రణలోకి తెచ్చుకోండి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

దీనికి ముందు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పాశ్చాత్య దేశాల్లోని ఉదారవాదులు భిన్న సమాజాలకు సంబంధించిన వ్యక్తుల వలసల్ని ఆహ్వానించారని, ఇప్పుడు ఫ్రాన్స్‌లో అల్లర్లకు ఇదే కారణమని ఆరోపించారు. ఈ పరిస్థితులు వస్తాయని ముందే హెచ్చరించినప్పటికీ, ఉదారవాదులు ఆ సూచనల్ని పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ‘‘ఫ్రాన్స్‌లో మరిన్ని చారిత్రాత్మక కట్టడాలు తగలబడకముందే ఈ ఉన్మాదాన్ని ఆపాలని ప్రార్థిస్తున్నాను’’ అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఫ్రాన్స్ అందమైన దేశమని, అక్కడి చారిత్రక వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

విద్యార్థి నిరసనల నుంచి హింసాత్మక ఘటన వరకు..

విద్యార్థుల నిరసనల రూపంలో ప్రారంభమైన ఫ్రాన్స్‌లో అల్లర్లు నెమ్మదిగా హింసాత్మకంగా మారాయి. పారిస్‌తో సహా దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో నిరసనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఈ హింస జరగడం గమనార్హం. మొదట్లో పాఠశాలల్లో మరింత మంది ఉపాధ్యాయులను నియమించాలని, విద్యార్థులకు మెరుగైన విద్యా పరిస్థితులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం కార్మిక సంఘాలు కూడా ఆందోళనల్లో భాగమయ్యాయి. జీవన వ్యయం పెరుగుదల, ప్రభుత్వ సేవలపై ఆందోళనలతో మరికొందరు నిరసనల్లో పాల్గొన్నారు. నిరసనకారులు లూటీలు, దహనాలు, కాల్పులకు పాల్పడుతున్నారు.