Imran Khan: పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది దాయాది దేశం పాకిస్తాన్. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) బెయిలౌట్ ప్యాకేజ్ కోసం తాత్కాలిక ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ఒప్పందంపై పాక్ మాజీ ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్యాన్సర్ చికిత్సకు డిస్ప్రిన్ (ఆస్పిరిన్)(నొప్పి నుంచి ఉపశమనానికి వాడే ట్యాబ్లెట్)ను వాడతారా..? అంటూ మండిపడ్డారు. రుణాల భారంతో నానాటికి మునిగిపోతుండటం పాకిస్తాన్ ను పెను విపత్తులోకి నెడుతుందని.. ఐఎంఎఫ్ ఒప్పందం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుందని అన్నారు. బుధవారం తన జమాన్ పార్క్ నివాసం నుంచి టెలివిజన్ ప్రసంగంలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Google Layoff: భారతదేశంలో గూగుల్ లేఆఫ్స్.. 450 ఉద్యోగుల తొలగింపు..
తనను రాజకీయాలకు దూరంగా ఉంచేందుకు పాకిస్తాన్ ను నాశనం చేయవద్దని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని.. శ్రీలంక వంటి గందరగోళ పరిస్థితుల్లో ఉందని ఆయన అన్నారు. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై గ్లోబల్ రేటింగ్ సంస్థ ఫిచ్ ఇచ్చిన రిపోర్టును ప్రస్తావిస్తూ పాక్ ప్రభుత్వాన్ని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. పాక్ కరెన్సీకి ఇష్యూర్ డీఫాల్ట్ రేటింగ్ ను ‘CCC-’ గా ఇచ్చింది. ఇది పాకిస్తాన్, శ్రీలంక పరిస్థితికి దిగజారడాన్ని సూచిస్తుంది. గతంలో పాకిస్తాన్ ‘CCC+’ రేటింగ్ లో ఉండేది.
పాకిస్తాన్-ఐఎంఎఫ్ డీల్ లో భాగంగా ప్రజలపై మరిన్ని పన్నులు రుద్దేందుకు పాక్ సర్కార్ మిని బడ్జెట్ ను బుధవారం తీసుకువచ్చింది. ఈ బడ్జెట్ మరో ద్రవ్యోల్భాణికి దారి తీస్తుందని, ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాక్ డిఫాల్ట్ దిశగా ప్రయానిస్తుందని, ఐఎంఎఫ్ ఒప్పందం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడం, ప్రజలు ఆదేశించిన ప్రభుత్వం మాత్రమే కఠిన నిర్ణయాలు తీసుకుని దేశాన్ని ఈ స్థితి నుంచి బయటపడేయదని ఆయన అన్నారు.
