అరుణా చల్ ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఓగ్రామం నిర్మించిందంటూ అమెరికా ఇటీవల ఓ నివేదికను విడుదల చేసిన విషయం తెల్సిందే. సరిహద్దుల్లో చైనా పెద్ద ఎత్తున మౌలిక సదు పాయాలు అభివృద్ధి చేస్తున్నట్లు ఆ నివేదికలో పేర్కొంది. అయితే తాజాగా ఈ నివేదిక పై భారత సైనిక వర్గాలు స్పందించాయి. ఆ గ్రామం చైనా నియంత్ర ఉన్న ప్రాంతంలోనే ఉన్నట్టు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. ఎగువ సుబాన్‌సిరి జిల్లాలో వివాదాస్పద సరిహద్దు వెంబడి ఉన్న ఆగ్రామం, గత ఆరు దశాబ్దాలుగా చైనా నియంత్రణలో ఉన్న ప్రాంతంలోనే ఉందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. 1959లో అసోం రైఫిల్స్ పోస్ట్‌ను ఆక్రమించుకున్న పీఎల్ ఏ అక్కడ తన సైనిక దళాలను మోహరించింది. అప్పటి నుంచి ఆ ప్రాంతం చైనా ఆధీనంలోనే ఉంది. తర్వాత అనేక నిర్మాణాలు చేపట్టినట్టు సైన్యం పేర్కొంది.
భారత్-చైనా వివాదస్పద సరిహద్దు వెంబడి చైనా వంద ఇళ్లను నిర్మించినట్లు కొద్ది రోజుల కిందట అమెరికా రక్షణ శాఖ తమ పార్లమెంట్‌కు ఓ నివేదిక సమర్పించింది. మెక్‌మోహన్ రేఖకు దక్షిణాన భారత సరిహద్దులో ఈ గ్రామం ఉన్నట్లు పేర్కొంది. ఈ గ్రామాన్ని చైనా 2020 మద్యలో నిర్మించి ఉండొచ్చని అమెరికా రక్షణ శాఖ ఆ నివేదికలో పేర్కొంది. ఉపగ్రహ ఛాయ చిత్రం ఆధారంగా ఓ ఇంగ్లిష్ టీవి ఛానల్ ఈ ఏడాది ఆరంభంలో ఓ వార్తా కథనం ప్రసారం చేసిన సంగతి కూడా తెల్సిందే.
గతేడాది జూన్‌లో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణను సైతం అమెరికా ప్రస్తావించింది. భారత్ వైఖరి వల్లే తాము ఎల్‌ఓసీ వెంట సైనిక మోహరింపులు చేపడుతన్నామని చైనా అంటుందని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంట మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు నిలిపివేయటం సహా భారత్ తన సైన్యాన్ని ఉపసంహారించుకునే వరకు తాము వెనక్కి వెళ్లేది లేదని చైనా పేర్కొన్నట్లు ఆ నివేదికలో అమెరికా రక్షణ శాఖ తెలిపింది.
