ఇది ప్రపంచంలోనే బ్యూటిఫుల్ మస్కిటో. సబతీస్ రకానికి చెందినది. దీనిని చూస్తే ఇదొక దొమ అన్న సంగతే మర్చిపోతాం. అంత అందంగా ఉంటుంది. అందమైన ఈకలు కలిగిన కాళ్లు, బ్రైట్ కలర్స్ తో మెరిసిపోతుంటుంది. ఇది ఎక్కువగా దక్షిణమెరికాలో కనిపిస్తుంది. అయితే అన్ని దోమల్లాగే ఇది కుడితే రోగాలు తప్పవు. కెనాడుకు చెందిన ఫొటోగ్రాఫర్ గిల్ విజెన్ దీనిని తన కెమెరాలో బంధించాడు. దీనికి గాను ఈ ఏడాది వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పోటీల్లో ప్రశంసలు పొందారాయన. లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం ఈ పోటీలు నిర్వహిస్తోంది. గిల్ ఓ ట్రెయిన్డ్ ఎంటమాలజిస్ట్. దీనిపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఇలాంటి ఫొటో తీయాలంటే ఇబ్బందులు తప్పవు. పక్కా ప్రణాళిక, సహనం అవసరం. ఈక్వెడార్‌లోని అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో ఈ దోమను ఫొటో తీశాడు.
దీని పొడవు కేవలం ఐదు మిల్లీమీటర్లు. మెటాలిక్ కలర్‌లో ఉండే ఈ మస్కిటో వివిధ రంగులలో మెరుస్తూ కనిపిస్తుంది. ఎక్కువగా నీలం, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కొన్నిసార్లు ఊదా రంగులోకి మారుతుంది. పొడవైన ఆరు కాళ్లుంటాయి. చూడగానే ఇది విజెన్‌ను ఎంతో ఆకట్టుకుంది. ఇదొక అద్భుతం అంటాడాయన. అందమైన బ్లడ్ సక్కర్ అని పేరు పెట్టాడు దీనికి. దీనిని ఇలా ఫొటో తీయటానికి ఆయనకు ఐదేళ్లు పట్టిందట. కాళ్ల నుండి రెక్కల వరకు చూపించాలనుకున్నాడు. అందుకే అంత టైమ్ పట్టింది ఒక్క ఫొటో తీయటానికి. సబతేస్ దోమలు చాలా అనూహ్యమైనవి, ఉత్తేజకరమైనవి కావడంతో వాటిని ఫోటో తీయడం చాలా కష్టం. ముఖ్యంగా ఈ ఫోటోను తీసిన ఈక్వెడార్‌లోని అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ వాతావరణంలో, ఇలాంటి ఫోటోలను తీయడం మరింత కష్టం.
ఈ దోమలు యెల్లో ఫీవర్, డెంగ్యూ జ్వరం వంటి పలు వ్యాధులకు ముఖ్య వాహకం. ఫోటో తీసే సమయంలో ఈ దోమ విజెన్‌ను చాలా సార్లు కుట్టింది. దాంతో తాను వ్యాధుల బారినపడే అవకాశాలు ఎక్కువే..కానీ ఇంకా బతికే ఉన్నానని అంటాడు సరదగా. ఆడ సబతేస్ దోమలు గుడ్లు పెట్టడానికి ముందు మాత్రమే రక్తం పీల్చుతాయి. మిగతా సమయాల్లో పూల మకరందాన్ని తీసుకుంటాయి. దీంతో ఇవి పరపరాగ సంపర్కం జరగడానికి ఉపయోగపడుతాయి. ఇదీ ఈ అందమైన దోమ కథ!!