బంగ్లాదేశ్ ప్రధానిగా ఈరోజు తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. తొలుత మంగళవారం ఉదయం 11:30 గంటలకు పార్లమెంట్ భవనంలో బీఎన్‌పీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా తారిక్ రెహమాన్‌ను ఎన్నుకోనున్నారు. అనంతరం ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం చేస్తారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం తారిక్ రెహమాన్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం.
చాలా కాలంగా ఉన్న సంప్రదాయం ప్రకారం బంగాభబన్‌లో కాకుండా పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని సౌత్ ప్లాజాలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. మంగళవారం మధ్యాహ్నం జాతీయ సంసద్‌లోని సౌత్ ప్లాజాలో అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బీఎస్‌ఎస్ వార్తా సంస్థ సోమవారం తెలిపింది. మంగళవారం ముందుగా ప్రధాన ఎన్నికల కమిషనర్ AMM నాసిర్ ఉద్దీన్ పార్లమెంటుకు కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ప్రమాణం చేయిస్తారు. అనంతరం పార్లమెంటరీ పార్టీ నాయకుడిని ఎన్నుకుంటారు.
ఇక తారిక్ ప్రమాణస్వీకారానికి భారత్ నుంచి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బృందం వెళ్లనుంది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ కూడా ఓం బిర్లాతో పాటు ఉండనున్నారు. రెహమాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు, టర్కిష్ అండర్ సెక్రటరీ బెరిస్ ఎకిన్సి, శ్రీలంక ఆరోగ్య, మాస్ మీడియా మంత్రి డాక్టర్ నలిందా జయతిస్సా హాజరు కానున్నారు.
తారిక్ రెహమాన్..
తారిక్ రెహమాన్.. దివంగత బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలిదా జియా కుమారుడు. 17 సంవత్సరంలో లండన్‌లో ప్రవాస జీవితం గడిపి ఇటీవలే రెండు నెలల క్రితం స్వదేశానికి వచ్చారు. ఇప్పటి వరకు ఎటువంటి ప్రభుత్వ పదవిని నిర్వహించలేదు. కుటుంబ రాజకీయ నేపథ్యం తప్ప.. ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేదు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా బంపర్ మెజార్టీ సీట్లతో విజయం సాధించారు. దీంతో తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ నుంచి తారిక్ రెహమాన్ ప్రభుత్వ బాధ్యతలు తీసుకోనున్నారు.
