బంగ్లాదేశ్‌లో గత కొద్దిరోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. యువ రాజకీయ నేత ఉస్మాన్ హాదీ హత్య తర్వాత దేశంలో పరిస్థితులు అదుపు తప్పాయి. హిందువులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. ఇంతలోనే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) తాత్కాలిక అధ్యక్షుడు తారిఖ్ రెహమాన్ ఢాకా చేరుకున్నారు. లండన్‌లో ఉంటున్న ఆయన 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు వచ్చారు. దీంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఫిబ్రవరి, 2026లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో తారిఖ్ రెహమాన్ రావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. తారిఖ్ రెహమాన్.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు. ప్రస్తుతం ఖలీదా జియా తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తల్లిని చూసేందుకే తారిఖ్ రెహమాన్ వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నా.. త్వరలోనే ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన రాక ప్రాధాన్యత సంతరించుకుంది. భార్య జుబైదా రెహమాన్, కూతురు జైమా రెహమాన్‌తో విమానంలో వస్తున్న ఫొటోలను తారిఖ్ రెహమాన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఇదిలా ఉంటే బుధవారం శక్తివంతమైన బాంబ్ పేలుడు కారణంగా ఢాకాలో ఒకరు చనిపోయారు. దీంతో మరొకసారి హింస చెలరేగింది. ఇలాంటి తరుణంలో తారిఖ్ రెహమాన్ రావడం.. ఆయన కోసం లక్షలాది మంది రోడ్లపైకి రావడంతో భద్రతా అధికారులకు తలనొప్పిగా మారింది. తొలుత విమానం బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ విమానాశ్రయంలో దిగింది. అక్కడ నుంచి ఢాకా చేరుకున్నారు. బుల్లెట్ ఫ్రూఫ్ బస్సులో తారిఖ్ రెహమాన్ అనేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆస్పత్రిలో ఉన్న తల్లి ఖలీదా జియాను పరామర్శిస్తారు.

ఇదిలా ఉంటే తారిఖ్ రెహమాన్ రాకపై భారతదేశం సానుకూల సంకేతాలు వ్యక్తం చేస్తోంది. ఖలీదా జియా ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశంతో మంచి సంబంధాలు ఉన్నాయి. త్వరలో జరిగే ఎన్నికల్లో బీఎన్పీ గెలిస్తే.. తిరిగి సంబంధాలు మెరుగుపడతాయని భారత్ భావిస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ బహిష్కరణకు గురైంది. షేక్ హసీనా భారత్‌లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యూనస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేంది బీఎన్‌పీనే.
তারেক রহমানকে বরণ করে নিতে সকাল থেকেই জনসমূদ্র ঢাকা মহানগরী | 25 Dec 2025 https://t.co/sTFVj8pnj4
— Bangladesh Nationalist Party-BNP (@bdbnp78) December 25, 2025