NTV Telugu Site icon

Ukraine Russia War: రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు విఫలం

ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య సమావేశం ముగిసింది. బెలారస్ వేదికగా సుమారు 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య చర్చలు విఫలమయ్యాయి. తక్షణమే కాల్పుల విరమణ చేయాలని, రష్యా సైన్యం తమ దేశం నుంచి వెనక్కు వెళ్లాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. అటు నాటోలో చేరబోమని ఉక్రెయిన్ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రష్యా కోరింది. ఈ డిమాండ్లకు ఇరుదేశాలు అంగీకరించకపోవడంతో చర్చలు విఫలంగా ముగిశాయి. ఒక్క తీర్మానం కూడా లేకుండా రెండు దేశాలు చర్చలను ముగించాయి. ఈ చర్చలకు ఉక్రెయిన్ రక్షణమంత్రి సహా ఆరుగురు ప్రతినిధులు హాజరు కాగా రష్యా నుంచి ఐదుగురు ప్రతినిధులు పాల్గొన్నారు.

మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. త‌మ దేశంపై ఆంక్షలు విధించిన దేశాల్లోని మెజారిటీ దేశాల విమానాలు ర‌ష్యా గ‌గ‌న‌త‌లంపై ఎగ‌ర‌కుండా నిషేధం విధించారు. ర‌ష్యా నిషేధం విధించిన దేశాల్లో బ్రిట‌న్‌, జ‌ర్మనీ, ఆస్ట్రియా, అల్బేనియం, బెల్జియం, బ‌ల్గేరియా, హంగేరీ, డెన్మార్క్‌, ఐర్లాండ్, స్పెయిన్‌, ఇటలీ, కెన‌డా, లాథ్వియా, లిథువేనియా, లక్సెంబ‌ర్గ్‌, రొమేనియా, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌, క్రొయేషియా, స్వీడ‌న్‌, ఎస్టోనియా త‌దిత‌ర దేశాలున్నాయి.

కాగా అటు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి భేటీలో పాల్గొన్నారు. గత 24 గంటల్లో ప్రధాని మోదీ మూడో సమావేశం నిర్వహిస్తుండగా.. ఉక్రెయిన్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఉక్రెయిన్ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా భారతీయులను కేంద్రం ఇప్పటికే తరలిస్తుండగా ఈ సమావేశంలో తరలింపును వేగవంతం చేయడంపై ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

Show comments