Site icon NTV Telugu

Taliban: రైలు హైజాక్‌తో మాకు సంబంధం లేదు.. పాక్ ఆరోపణలపై తాలిబన్లు..

Taliban

Taliban

Taliban: బలూచిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్‌ ఘటనలో ఆఫ్ఘనినిస్తాన్‌కి చెందిన ఉగ్రవాదుల ప్రమేయం ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. అయితే, పాకిస్తాన్ వాదనల్ని తాలిబన్లు తోసిపుచ్చారు. ‘‘బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ప్యాసింజర్ రైలుపై జరిగిన దాడిని ఆఫ్ఘనిస్తాన్‌తో ముడిపెడుతూ పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి చేసిన నిరాధారమైన ఆరోపణలను మేము నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాము. ఇటువంటి బాధ్యతారహిత వ్యాఖ్యలకు బదులుగా వారి స్వంత భద్రత , అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టాలని పాకిస్తాన్ వైపును కోరుతున్నాము’’ అని ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ ఖహార్ బాల్కీ అన్నారు.

Read Also: Starlink Link India: భారత్‌లో స్టార్ లింక్ సేవలు.. విజయం అంత ఈజీ కాదుగా!

మంగళవారం, బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్‌కి వెళ్తున్న జఫర్ ఎక్స్‌ప్రెస్‌ని బలూచిస్తాన్ లిబరేషర్ఆర్మీ(బీఎల్ఏ) హైక్ చేసింది. 450 మంది ప్రయాణికుల్లో వందలాది మందిని బీఎల్ఏ బందీలుగా పట్టుకుంది. అయితే, దాడి చేసిన వారికి, ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద నాయకులు సహాయం చేశారని, ఆ దేశంలోని ఉగ్రవాద నాయకులు ఈ దాడికి కుట్ర పన్నారని పాకిస్తాన్ ఆరోపించడంపై తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే, బలూచ్ తిరుగుబాటుదారులు హైజాక్ చేసిన రైలు నుంచి బందీలను రక్షించే ఆపరేషన్ పూర్తయినట్లు పాక్ భద్రతా బలగాలు చెప్పాయి. ఈ హైజాక్‌లో పాల్గొన్న 33 మంది ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు పాక్ ఆర్మీ ప్రతినిధి బుధవారం ప్రకటించారు. ఈ ఆపరేషన్‌లో 21 మంది ప్రయాణికులు, నలుగురు సైనికులు చనిపోయినట్లు వెల్లడించారు. మరోవైపు, తమ బందీల్లో 100 మంది వరకు చనిపోయినట్లు బీఎల్ఏ చెబుతోంది. బీఎల్ఏ పాక్ ఆర్మీ వాదనల్ని తోసిపుచ్చింది. పోరాటం ఇంకా కొనసాగుతోందని, పాకిస్తాన్ దళాలు భారీ నష్టాన్ని చవిచూస్తున్నాయని చెప్పింది.

Exit mobile version