ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రజాస్వామ్యానికి దేశంలో తావులేదని, షరియా చట్టం ప్రకారమే పరిపాలన సాగుతుందని ఇప్పటికే తాలిబన్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రజలు ప్రాణాలకు తెగించి తాలిబన్లకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. నిన్నటి రోజుక నిరసనకారులపై తాలిబన్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతిచెందగా, 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో పౌరులు పెద్దసంఖ్యలో రోడ్డుమీదకు వచ్చి జాతీయ జెండాలతో ర్యాలీని నిర్వహించారు. కాబూల్‌లోని ప్రముఖ ప్రాంతాల్లో తాలిబన్ల జెండాలు తొలగించి ఆఫ్ఘన్ జాతీయ జెండాలను ఎగరవేశారు. దీంతో తాలిబన్లు పౌరులు నిర్వహిస్తున్న ర్యాలీపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతిచెందారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఇలాంటి దారుణం జరగడం పట్ల ఆఫ్ఘన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ చీకటిరోజులు ప్రారంభం అయ్యాయని ఆందోళన చెందుతున్నారు.