Syria: సిరియాను తిరుగుబాటుదారులు ఆక్రమించడంతో ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ రష్యాకు పారిపోయాడు. అనంతరం సిరియాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ఈ నూతన సర్కార్ లో గవర్నమెంట్ ఉద్యోగులకు 400 శాతం మేరకు జీతాలు పెంచుతామని ఆ దేశ ఆర్థిక మంత్రి మహమ్మద్ అబ్జాద్ వెల్లడించారు. 1.65 ట్రిలియన్ సిరియన్ పౌండ్ల వేతనాలను దేశ వనరుల నుంచి సమకూర్చనున్నట్లు చెప్పుకొచ్చారు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో భాగంగా వేతనాల పెంపును అమలు చేయబోతున్నామని మహమ్మద్ అబ్జాద్ వెల్లడించారు.
Read Also: HMPV Virus: భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చైనా కొత్త వైరస్.. 8 ఏళ్ల చిన్నారికి నిర్ధారణ
కాగా, గత కొన్నేళ్లుగా జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల సిరియా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని మంత్రి మహమ్మద్ అబ్జాద్ తెలిపారు. అయితే, తమ కొత్త ప్రభుత్వానికి ఆర్థిక సహాయం చేస్తామని అరబ్ కంట్రీస్ హామీ ఇచ్చాయని పేర్కొన్నారు. సిరియాకు చెందిన విదేశాల్లోని 400 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను విడిపించుకొనే దిశగానూ తాము ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని చెప్పుకొచ్చారు. మరోవైపు, 400 శాతం మేర జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించడంతో సిరియాలోని ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.