Site icon NTV Telugu

Balochistan: బలూచిస్తాన్‌లో విరుచుకుపడిన BLA.. 10 మంది పాక్ అధికారులు మృతి..

Bla

Bla

Balochistan: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) భారీ ఎత్తున దాడులు చేసింది. 12 ప్రాంతాల్లో సమన్వయ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 10 మంది పాకిస్తాన్ భద్రతా అధికారులు మరణించగా, 37 బీఎల్ఏ యోధులు మరణించినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో కాల్పులతో పాటు ఆత్మాహుతి బాంబు దాడులు జరిగినట్లు తెలుస్తోంది. క్వెట్టా, పస్ని, మస్తుంగ్, నోష్కి, గ్వాదర్ జిల్లాల్లో ఈ దాడులు జరిగినట్లు పాక్ సీనియర్ భద్రతా అధికారి వెల్లడించారు. అయితే, ఇప్పటివరకు ఈ దాడుల్లో ఎంత మంది సాధారణ ప్రజలు మరణించారనే వివరాలు వెలువడలేదు. భద్రతా సిబ్బంది వేగంగా స్పందించడంతో దాడుల తీవ్రతను తగ్గించినట్లు అధికారులు చెప్పారు.పాకిస్తాన్ భద్రతా దళాలలోని కొంతమంది సభ్యులను అపహరించినట్లు సమాచారం. ఇంటర్నెట్, రైలు సేవలు నిలిపివేశారు. అయితే భద్రతా ఆపరేషన్ జరుగుతోంది.

Read Also: Tabletop runway: అజిత్ పవార్ మరణానికి “టేబుల్‌టాప్ రన్‌వే” కారణమా..?

దశాబ్ధాలుగా ఈ ప్రాంతం స్వాతంత్య్రం కోసం బీఎల్ఏ పోరాడుతోంది. ముఖ్యంగా, పాక్ సైన్యం, ఫ్రాంటియర్ ఫోర్స్ ను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతోంది. గతంలో పెషావర్ క్వెట్టా మధ్య నడిచే జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బీఎల్ఏ ఫైటర్లు హైజాక్ చేశారు. ఆ సమయంలో వందలాది మంది పాక్ సైనికుల్ని హతమార్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే, వీటిని పాక్ సైన్యం అధికారికంగా ప్రకటించలేదు. బలూచిస్తాన్‌లో పాక్ ఆర్మీ చేస్తున్న అఘాయిత్యాలపై బీఎల్ఏ అంతర్జాతీయ సహాయాన్ని కోరుతోంది. మరోవైపు, బలూచిస్తాన్ మీదుగా వెళ్తున్న చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(CPEC) ప్రాజెక్టులను కూడా బీఎల్ఏ టార్గెట్ చేస్తోంది.

Exit mobile version