నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ క్షేమంగా భూమ్మీదకు చేరుకుంది. దాదాపు తొమ్మిది నెలల తర్వాత అంతరిక్షం నుంచి సురక్షితంగా భూమ్మీద ల్యాండ్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులతో పాటు ప్రజలంతా స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఇదిలా ఉంటే సునీతా కుటుంబ సభ్యులు జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సునీతా విలియమ్స్ క్షేమంగా భూమ్మీదకు చేరుకుందని తెలిపారు. అంతేకాకుండా త్వరలో సునీతా విలియమ్స్ భారత్‌లో పర్యటిస్తారని బంధువు ఫల్గుణి పాండ్యా వెల్లడించారు. సురక్షితంగా భూమ్మీదకు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.
తిరిగి సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్తారా? లేదా? అనేది ఇంకా తెలియదు అని చెప్పారు. సునీతాదే ఫైనల్ నిర్ణయమని చెప్పుకొచ్చారు. సునీతా అందరికీ ఆదర్శం అని పేర్కొన్నారు. సునీతా తన 59వ పుట్టిన రోజు సెప్టెంబర్ 19న అంతరిక్షంలోనే జరుపుకుందని చెప్పారు. అన్ని క్షేమంగా జరిగేలా చేసిన దేవునికి పాండ్యా కృతజ్ఞతలు తెలిపారు.
గతేడాది జూన్ 5న సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లారు. వారంలోనే తిరిగి రావాల్సి ఉండగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దాదాపు తొమ్మిది నెలల పాటు ఉండి పోవల్సి వచ్చింది. మొత్తానికి ఇన్నాళ్లకు క్షేమంగా సునీతా విలియమ్స్ భూమ్మీదకు చేరుకుంది.
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ కూడా సునీతా విలియమ్స్‌కు లేఖ రాశారు. భారత్‌లో పర్యటించాలని లేఖలో కోరారు. సునీతా రాక కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.