Site icon NTV Telugu

Pakistan: భారత్ ‘‘నీటి బాంబు’’తో ఆకలి చావులు తప్పవు.. పాకిస్తాన్ సెనెటర్ ఆందోళన..

Pakistan Senator Syed Ali Zafar

Pakistan Senator Syed Ali Zafar

Pakistan: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మందిని పాశవికంగా లష్కరేతోయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటన తర్వాత, భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది. ఈ చర్యల తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టింది. పాక్, పీఓకేలోని భూభాగాల్లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది. ఈ దాడిలో 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, ఇప్పుడు పాకిస్తాన్‌ని భయపెడుతున్న అంశం సింధు జల ఒప్పందం నిలిపివేత.

Read Also: IndiGo Incident: పాకిస్తాన్ వల్ల 220 మంది ప్రాణాలు గాలిలో కలిసేవే.. నిమిషంలో 2.5 కి.మీ కిందకు పడిపోయిన విమానం..

తాజాగా, పాకిస్తాన్ సెనెటర్ సయ్యద్ అలీ జాఫర్ తన ఆందోళన వ్యక్తపరిచారు. భారతదేశం వేసిన ‘‘నీటి బాంబు’’ని నిర్వీర్యపరచాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ని కోరారు. ప్రతిపక్ష ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ)కి చెందిన జాఫర్ మాట్లాడుతూ.. సింధూ జలాలు నిలిపేయడం వల్ల పది మందిలో ఒకరు ప్రభావితమవుతారని హెచ్చరించారు. ‘‘మనం ఇప్పుడు ఈ నీటి సంక్షోభాన్ని పరిష్కరించకపోతే, మనం ఆకలితో చనిపోవచ్చు. కారణం సింధు నదీ పరీవాహక ప్రాంతం మన జీవనాడి. మన నీటిలో మూడు వంతులు దేశం వెలుపల నుండి వస్తాయి. ప్రతి పది మందిలో తొమ్మిది మంది అంతర్జాతీయ సరిహద్దు పరీవాహక ప్రాంతాల ఆధారంగా తమ జీవితాలను గడుపుతున్నారు’’ అని జాఫర్ అన్నారు. పాకిస్తాన్ పంటల్లో 90 శాతం ఈ నీటిపై ఆధారపడి ఉంటాయని, మన విద్యుత్ ప్రాజెక్టులు, ఆనకట్టలన్నీ సింధూ జలాలపై నిర్మించబడ్డాయని, అందుకు ఇది పాకిస్తాన్‌పై నీటి బాంబు లాంటిదని చెప్పారు.

సింధు జలాల ఒప్పందం పాకిస్తాన్‌కు మూడు పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్‌ల నుండి నీటిని నియంత్రించడానికి అనుమతించింది, అదే సమయంలో తూర్పు నదులైన రావి, సట్లెజ్, బియాస్‌లకు భారతదేశానికి హక్కులు కల్పించింది. ఈ జలాలు పాకిస్తాన్ నీటిపారుదల, తాగునీటి అవసరాలకు చాలా ముఖ్యమైనవి, ఇవి పాక్‌లో 80% నీటిని అందిస్తాయి. అయితే, పహల్గామ్ దాడి తర్వాత భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపేసింది. ‘‘రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు’’ అని ఇటీవల ప్రధాని మోడీ ఈ ఒప్పందం గురించి పాకిస్తాన్‌కి స్పష్టంగా చెప్పారు.

Exit mobile version