తనకు ఉన్న ఒక్క ఇంటిని కూడా కాల్చివేశారని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దేశ టెలివిజన్‌లో మాట్లాడుతూ.. తనకు వ్యక్తిగతంగా జరిగిన నష్టంపై ఆయన స్పందించారు. హిట్లర్ తరహా మనస్తత్వం ఉన్న వ్యక్తులే ఇలాంటి చర్యలతు దిగుతారని ఆయన మండిపడ్డారు. దేశం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా అధ్యక్షుడి కోరిక మేరకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టానని ఆయన చెప్పుకొచ్చారు.
కనీస నిత్యావసరాలు తీర్చుకోలేని స్థితిలో దేశం ఉండగా.. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే భారాన్నిమోసేందుకు సిద్ధమయ్యానన్నారు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు 4 సంవత్సరాలు పడుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసిందని వెల్లడించారు. ఇదంతా ఒకటి రెండు రోజుల్లో తీరే సమస్య కాదని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే చర్యలు చేపడుతున్న సమయంలో తన ఇంటికి నిప్పు పెట్టడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. నియంత హిట్లర్ తరహా మనస్తత్వం ఉన్నవారే ఇలాంటి చర్యలు దిగుతారన్నారు. తాను ప్రధాని పదవికి రాజీనామా నిరాకరించానని, అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటుకు అభ్యంతరం చెప్పానంటూ ఓ పార్టీ నేత చేసిన ట్వీట్ ఈ పరిస్థితికి దారితీసిందని చెప్పారు. ఒకవేళ అఖిలపక్షం ఏర్పడినా వెంటనే రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు.
PM Modi: ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లిలాంటిది..
శనివారం అన్ని సమావేశాలను రద్దు చేసుకొని, ఇంట్లోనే కూర్చున్నా. అప్పుడు పోలీసులు వచ్చి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, ఇక్కడ పరిస్థితులు అదుపుతప్పే అవకాశం ఉందని వెల్లడించారని రణిల్ విక్రమ సింఘే తెలిపారు. వెంటనే భార్యతో కలిసి సాయంత్రం అక్కడి నుంచి వెళ్లిపోయానన్నారు. సొంత దేశంలో, విదేశంలో కలిపి తనకు ఒకే ఒక్క ఇల్లు ఉందన్నారు. ఆ ఒక్క దానికి కూడా నిప్పుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన లైబ్రరీలో 2,500 పుస్తకాలున్నాయని.. అదే తనకున్న ఆస్తి అని వెల్లడించారు. 200 ఏళ్ల నాటి విలువైన కళాఖండాలున్నాయన్నారు. అన్నింటిని ధ్వంసం చేసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితకాలంలో సేకరించిన పుస్తకాలన్నింటిని శ్రీలంకలోని కళాశాల, ఒక అంతర్జాతీయ సంస్థకు వితరణ చేయాలనుకున్నానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.