శ్రీలంక దేశాన్ని ఆర్థిక సంక్షోభం అతలాకుతలం చేస్తోంది. తాజాగా జరిగిన ఓ ఘటన ఆ దేశంలో పరిస్థితి ఎంతలా దిగజారిందో తెలియజేస్తోంది. నిధుల కొరత కారణంగా దిగుమతులు చేసుకోలేని దుస్థితి తలెత్తడంతో ఆ దేశంలో పేపర్ నిల్వలు అడుగంటిపోయాయి. దీంతో సోమవారం నుంచి జరగాల్సిన టర్మ్ పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ప్రశ్నపత్రం తయారీకి సరిపడా పేపర్, ఇంక్ లేకపోవడంతో పరీక్షలు నిర్వహించలేకపోతున్నామని అధికారులు ప్రకటించారు. శ్రీలంక అధికారుల నిర్ణయంతో దేశంలోని మొత్తం 45 లక్షల విద్యార్థుల్లో 30 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడనుంది.
మరోవైపు కరోనా తర్వాత చోటుచేసుకున్న పరిణామాల కారణంగా శ్రీలంకలోని టూరిజం కూడా పూర్తిగా దెబ్బతింది. అటు దిగుమతులకు సరిపడా విదేశీ మారకద్రవ్యం లేకపోవడంతో శ్రీలంక దేశం ఆహారం, ఇంధనం, ఔషధాల దిగుమతులు కూడా భారీగా తగ్గాయి. దీంతో దేశంలో విద్యుత్ కోతలు విధించే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.