NTV Telugu Site icon

Srilanka Economic Crisis: రాజపక్స పరార్.. ఎక్కడికో తెలుసా..

Gotabaya Rajapaksa

Gotabaya Rajapaksa

శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది. రాజపక్స పారిపోయేందుకు అక్కడి మిలిటరీ సహకరించినట్లు వార్తలు వస్తున్నాయి. బుధవారం రాజీనామా చేస్తానని వెల్లడించి రాజపక్స, ప్రజల తిరుగుబాటుతో పరారయ్యారు. దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శనివారం నుంచి శ్రీలంకలో మళ్లీ భారీ స్థాయిలో ఆందోళనలు, నిరసనలు పెల్లుబికాయి. దీంతో పరిస్థితిని గమనించిన రాజపక్స కొలంబోలోని తన అధ్యక్ష అధికారిక నివాసం నుంచి పారిపోయారు. వెళ్తూ వెళ్తూ భారీ సూటికేసులతో దేశం దాటినట్లు వార్తలు వచ్చాయి. భారీగా ప్రెసిడెంట్ నివాసానికి వచ్చిన ప్రజలు భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రాజపక్స రాజీనామా చేసేదాకా అధ్యక్ష భవనం నుంచి కదిలేది లేదంటూ అక్కడే మకాం వేశారు.

ఇదిలా ఉంటే గొటబాయ రాజపక్స బుధవారం దేశం వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. రాజపక్స శ్రీలంకను వదిలిపెట్టి పక్కనే ఉన్న మరో ద్వీపదేశం మాల్దీవులకు పరారయ్యారు. గొటబాయ రాజపక్స, ఆయన భార్య ఆంటోనోవ్ – 32 విమానంలో మాల్దీవులకు వెళ్లారని తెలుస్తోంది. మొత్తం 15మంది కుటుంబ సభ్యులతో దేశం రాజపక్స పరారైనట్లు తెలుస్తోంది. రాజపక్స సోదరులు మొత్తం నలుగురు అందరికన్నా పెద్దవాడు చమల్ రాజపక్స. ఆ తరువాత వారిలో మహిందా రాజపక్స, గొటబాయ రాజపక్స, బాసిల్ రాజపక్స ఉన్నారు. ప్రస్తుతం గొటబాయ రాజపక్స కొడుకు నికల్ తో సహా దేశం వదిలినట్లు తెలుస్తోంది. కొలంబోలోని ప్రధాన విమానాశ్రయం నుంచే రాజపక్స పరారైనట్లు అక్కడి మీడియా వెల్లడిస్తోంది. దేశం విడిచి వెళ్లేందుకు రాజపక్స చేసిన ప్రయత్నాలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి. జూలై 13న రాజీనామా చేసే లోపే దేశం వదిలి పారిపోవాలని అధ్యక్షుడు నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. అధ్యక్ష పదవిలో ఉంటే రాజపక్స అరెస్ట్ నుంచి మినహాయించబడతాడు.

Read Also: Saudi Arabia: సౌదీ యువరాజు ఓ సైకో.. పలు దేశాలకు ముప్పులా పరిణమించాడు!

అయితే గత శనివారం గొటబాయ శ్రీలంక నేవీ షిప్ గజబాహులో దేశం వదిలిపారిపోయినట్లు వార్తలు వచ్చాయి. యూఏఈకి పారిపోవాలని అనుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మాల్దీవులు పారిపోయినట్లు దాదాపుగా కన్ఫార్మ్ అయింది. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి కారణం అక్కడ ప్రజలు గొటబాయ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని గత మార్చి నుంచి ఆందోళనలు చేస్తున్నారు. అధ్యక్షుడు గొటబాయతో పాటు ప్రధాని మహిందా రాజపక్సతో పాటు రాజపక్స కుటుంబీకుల అవినీతి వల్లే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.